అయ్యప్ప దీక్షతో… శనికి దూరం

అయ్యప్ప దీక్షతో… శనికి దూరం
December 04 14:37 2017
శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు 41 రోజుల పాటు మాలను ధరించి, ఇరుముడి కట్టుకుని వెళ్తారు. గురుస్వామి ద్వారా మాలను ధరించిన భక్తులు కఠిన నియమాలతో 41 రోజుల పాటు దీక్ష చేస్తారు. అయితే దీక్షలో నల్లని వస్త్రాలు ధరించడం తొలి నియమం. నల్లని వస్త్రాలు ధరించడం అనే నియమం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చూసుకుంటే శీతాకాలంలో నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల శరీరానికి ఉష్ణప్రసరణ అందుతుంది. రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది.ఆధ్యాత్మికంగానూ నలుపు వస్త్రాలు తప్పనిసరిగా ధరించడానికి ఓ కారణం ఉంది. శనిదేవుడికి, అయ్యప్పకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం శనికి ప్రీతికరమైన నలుపు వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. కలియుగానికి అధిపతి శనీశ్వరుడు. శని ప్రభావానికి గురైతే రాజు పేద అనే తేడా ఉండదు. జనులను పట్టి పీడిస్తోన్న శనిదేవుని ఒక రోజు అయ్యప్ప ఇలా అడిగారు… జనులను ఎందుకు ఏడేళ్లు పట్టిపీడుస్తున్నావని అంటే, అది తన ధర్మం అని బదులిచ్చాడు. ప్రజలను పీడించడం కూడా ధర్మమేనా అని స్వామి అడిగితే… త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయకారులు అది వారి ధర్మం. జీవుల ప్రాణాలు తీయడం యముడి ధర్మం. త్రిమూర్తుల ఆదేశాలతోనే ప్రపంచంలో ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తున్నారని శనిదేవుడు పేర్కొన్నాడు.నీ ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఏం జరుగుతుందని అంటే.. సృష్టిధర్మం తలక్రిందులవుతుందని అన్నారు. దీనికి స్వామి.. సృష్టిధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖసంతోషాలకు, ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. నరుల తమ పూర్వజన్మ పాపాల కారణంగా విధాత వారి తలరాత రాస్తున్నాడు కాబట్టి అనుభవించక తప్పదని శనీశ్వరుడు అన్నాడు. నీ కారణంగా ఏడేళ్లలో అనుభవించే కష్టాలన్నీ తన భక్తులు సంవత్సరానికి మండల కాలంలో అంటే 41 రోజులు అనుభవిస్తారని అయ్యప్ప పేర్కొన్నారు. ఉభయ సంధ్యలలో చన్నీటి స్నానాలు ఆచరించి, నీకిష్టమైన నల్లని వస్త్రాలు ధరించి, నఖకేశ సంస్కారాలు మాని, పాదరక్షాలు విడిచి, సాత్వికాహారం భుజిస్తారు. తమ స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలవడి, కఠిన బ్రహ్మచర్యం పాటించి 41 రోజులు దీక్షచేస్తారు.అడవులు వెంబడి పాదచారులై తన దర్శనానికి వచ్చే భక్తులను జీవితంలో ఎప్పుడూ పట్టి పీడించరాదని, శుభయోగం కలిగించాలని అయ్యప్ప ఆదేశించారు. అయ్యప్పకు ఇచ్చిన మాట ప్రకారం శనీశ్వరుడు ఆయన భక్తులను ఎప్పుడూ పట్టిపీడంచడని ప్రతీతి. అందుకే దీక్షలో నల్లని వస్త్రాలు ధరించడం ఒక నియమం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10299
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author