పర్యవేక్షణ ముమ్మరం చేయండి

పర్యవేక్షణ ముమ్మరం చేయండి
December 04 15:25 2017
వరంగల్,
వరంగల్‌లో కొన్ని రోజులక్రితం వెలుగుచూసిన మెడికోల ఘటన విద్యార్ధిలోకాన్ని నివ్వెరపరిచింది. వసతి గృహంలో 22 మంది విద్యార్ధులు గంజాయి మత్తులో జోగుతున్న ఉదంతం సంచలనం సృష్టించింది. పవిత్ర వైద్య విద్యనభ్యసించే విద్యార్ధులు ఇలాంటి స్థితిలో పట్టుబడతారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనతోనైనా మిగతా ప్రభుత్వ వసతి గృహాలపై కన్నేయాల్సి ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణతో వసతిగృహాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. పర్యవేక్షణ ద్వారా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు కూడా ఇట్టే తెలిసిపోతాయని పలువురు అంటున్నారు. పర్యవేక్షణ ఉండడం వల్ల తప్పులు చేసే విద్యార్థుల్లో భయం నెలకొంటుందని క్రమశిక్షణారాహిత్యానికి కొంతమేర చెక్ పడుతుందని చెప్తున్నారు. ఇదిలాఉంటే కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని వసతిగృహాల్లో పర్యవేక్షణ కోసం అవసరమయ్యే అధికారులే లేరు. వసతిగృహాల సంచాలకులే ఈ బాధ్యతలను చూడాల్సి వస్తోంది.  కేయూ ఉన్నతాధికారులు పర్యవేక్షణను పటిష్టపరచాలంటే అన్ని వసతిగృహాలకు సంయుక్త సంచాలకులను తక్షణమే నియమించాల్సి ఉంటుంది. ఏదైన సంఘటన జరిగిన తరువాత చర్యలు తీసుకునే బదులు ముందే జాగ్రత్త పడాలని కేయూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పద్మాక్షిమహిళా వసతిగృహంలో 1126, ఇంజినీరింగ్‌ 326, జగ్జీవన్‌రామ్‌ 315, పోతన 214, బీఆర్‌.అంబేడ్కర్‌ 178, గణపతిదేవ-1,2,3లో 193, న్యాయకళాశాల 40, విద్యారణ్య 53, ఫార్మసీ, 60, పాత ఫార్మసీ 83, పరిశోధకుల వసతిగృహంలో 8 మంది ఉంటున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 32 పీజీ కోర్సులతోపాటు, న్యాయ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, బీఈడీ, ఎంఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ల్లో వేలాది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వర్సిటీలో మొత్తం 3500 సీట్లు అందుబాటులు ఉన్నాయి. ఇందులో 3 వేల విద్యార్థులకు క్యాంపస్‌లోని విశ్వవిద్యాలయం నిర్వహణలోని వసతిగృహాల్లోనే బస. వీరికి వసతి కల్పిస్తున్న అధికారులు తరువాత వారి యోగక్షేమాలను విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సరైన వసతులు లేవని విద్యార్థులు తరచుగా ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. వసతిగృహాల్లోని గదుల్లో ఎంతమంది ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందంటే పర్యవేక్షణ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కొన్ని గదుల్లో ఫ్యాన్‌లు తిరగవు. మరికొన్నింటిలో మంచాలు, కుర్చీల్లేవు. రాత్రిపూట ఏం జరుగుతుందో కూడా తెలియదు. వీటన్నింటిని అధిగమించాలంటే నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని విద్యార్ధి సంఘాలు సూచిస్తున్నాయి. ఉన్నతాధికారులు రాత్రివేళల్లో వసతిగృహాలవైపే రారని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదైన సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే కంటే ముందస్తుగానే చర్యలు తీసుకుని విద్యార్ధుల భద్రతకు పెద్దపీట వేయాలని అంతా కోరుతున్నారు. కేఎంసీ ఇష్యూతోనైనా అధికార యంత్రాంగం అలసత్వం వీడి త్వరితగతిన హాస్టళ్లలో పర్యవేక్షకులను నియమించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10308
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author