నిర్వాసితుల కాలనీలో కనీస వసతులు కరవు

నిర్వాసితుల కాలనీలో కనీస వసతులు కరవు
December 04 15:41 2017
తూర్పుగోదావరి,
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. అయితే ఈ పునరావాస కాలనీలో కనీస వసతులు కరవై ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. దీనికితోడు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో చెల్లించక పోవడంతో పలువురు ఈ కాలనీల్లో ఇంకా అడుగిడలేదు. దీంతో కాలనీలో పలు గృహాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి నివాసానికి ఆస్కారంలేకుండా మారాయి. దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన డి.రావిలంక, పరగసానిపాడు, బోడిగూడెం గ్రామాలకు 2006లో ఇందుకూరు సమీపంలో పెదబియ్యంపల్లి వద్ద పునరావాస కాలనీ ఏర్పాటుచేశారు. సుమారు 200 కుటుంబాలకు ఇక్కడ ఇళ్లు నిర్మించారు. అయితే నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహారం, భూమి అందజేత ప్యాకేజీల సమస్యలు కొలిక్కి రాలేదు. దీంతో పలు బాధిత కుటుంబాలు ముంపు ప్రాంతాల్లోనే ఉంటుండడగా.. పలువురు ఈ కాలనీలకు వచ్చి దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డి.రావిలంక గ్రామానికి చెందిన గిరిజనులకు భూములకు బదులు చూపించిన పొలాలు వివాదాల్లో ఉన్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తమ సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అంటున్నారు నిర్వాసితులు. ఇదిలా ఉంటే మూడు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించిన ఈ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి పథకం పనిచేయక పోవడంతో గత కొన్ని రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా తాగునీరు అందే మార్గం లేకపోవడంతో కాలనీ వాసులంతా సత్యసాయి తాగునీటి పథకంపై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఈ పథకం నుంచి కూడా తాగునీరు అందడం లేదని వారు పేర్కొంటున్నారు. కాలనీలో నిర్మించిన సిమెంటు రోడ్లు తుప్పలతో అధ్వానంగా మారాయి. డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు ప్రవహించడం లేదు. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతుండడంతో దోమలు పెరిగిపోతున్నాయి. పలువురు అనారోగ్యాలబారిన పడుతున్నారు. పునరావాస కాలనీ దుస్థితిని తెలుసుకున్న అధికారులు కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్తున్నారు. తాగునీటి పథకాన్ని మరమ్మతులు చేయించి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. డ్రైనేజీల్లో పేరుకు పోయిన మట్టి, చెత్తను తొలగించి మురుగునీటిపారుదలకు చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు చెప్పడం కాక సత్వరమే చర్యలు ప్రారంభించి కాలనీని ఆవాసయోగ్యంగా మలచాలని అంతా కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10317
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author