ఆశాజనకంగానే సాగునీరు!

ఆశాజనకంగానే సాగునీరు!
December 07 12:45 2017
తూర్పుగోదావరి,
ఖరీఫ్‌ నాటికి గోదావరి జలాలను ఏలేరుకు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులకు నిర్దేశించారు. పంట దిగుబడి పెరిగి రైతన్నలు ఆర్ధికంగా బలపడేందుకు పంట పొలాలకు పుష్కలంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సీఎం సూచనల మేరకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. టార్గెట్ చేరుకోవడంలో కొంత మేరకు సఫలమయ్యారు. దీంతో స్థానిక రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదటి దశను ఆగస్టులో ప్రారంభించారు ముఖ్యమంత్రి. అయితే అప్పటికీ దీనికి సంబంధించి పనులు పూర్తి కాలేదు. అనంతరం రెండు మోటార్ల ద్వారా మొదటి విడత, తరువాత రెండో విడతలో కొంత మేరకు పనులు చేసి ఏలేరుకు నీటిని తరలించారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు పురుషోత్తపట్నం మొదటి దశ పనులపై దృష్టి పెట్టారు. దీంతో పాటు ఏలేరుకు నీటి లభ్యతలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పురుషోత్తపట్నం మొదటి దశకు సంబంధించి అయిదు పైపులైన్లు వేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం ఒక లైను మాత్రమే ఏర్పాటు చేసి రోజుకు 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
రెండో దశలో రోజుకు 525 క్యూసెక్కులు మాత్రమే పంపింగ్‌ చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏలేరుకు సరిపోతుంది. గోదావరికి ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గితే ఒకటి లేదా రెండు రోజుల్లో పురుషోత్తపట్నం నుంచి నీటి పంపింగ్‌ను నిలిపివేస్తారు. పుష్కర పథకం ద్వారా నీటిని పోలవరం ఎడమ ఫ్రధాన కాలువలోకి తోడాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఎల్‌ఎంసీలో 50 కిలోమీటర్ల మేరకు పూర్తి సామర్థ్యంతో నీటిని అందుబాటులో ఉంచారు. మొదటి దశ పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది పంపులు, మూడు మోటార్లు హెడ్‌వర్క్సు వద్దకు చేరాయి. ఇప్పటికే అక్కడ సివిల్‌ పనులు పూర్తికావడంతో వాటిని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీంతో పాటు నాలుగు పైపులైన్ల పనులనూ పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశ పనులకు సంబంధించి ఎనిమిది మోటార్లలో ఇప్పటి వరకు నాలుగు సరఫరా అయ్యాయి. జనవరి నెలాఖరుకు పురుషోత్తపట్నం మొదటి, రెండో దశ పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్‌ఈ ఇటీవలే తెలిపారు. ఏదేమైనా సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై తూర్పుగోదావరి రైతాంగం హర్షం వ్యక్తంచేస్తోంది. మరింత ఎక్కువగా నీరు అందుబాటులో ఉంచితే ఖరీఫ్ సీజన్‌లో గణనీయమై దిగుబడిని సాధించగలమని రైతులు అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10785
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author