కొడంగల్ లో  పొలిటికల్ దంగల్ 

కొడంగల్ లో  పొలిటికల్ దంగల్ 
December 08 13:10 2017
హైద్రాబాద్,
రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ ఇప్పుడు పొలిటికల్ దంగల్ కు సిద్ధమైందా? ఎన్నడూ లేని విధంగా అక్కడ గులాబీ శ్రేణులు మొహరించాయా? ఉప ఎన్నిక వస్తే కొడంగల్ మరో కురుక్షేత్రాన్ని తలపించనుందా? ఆపరేషన్ ఆకర్ష్ తో ఊరు-వాడ …చేరికల సందడి నెలకోనుందా? టీఆర్ఎస్ రాజకీయానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఏమిటి? కాంగ్రెస్ నేతగా కొడంగల్ లో రేవంత్ వ్యూహాలేమిటి? సొంత నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రేవంత్…ఇప్పుడు టీఆర్ఎస్ దాటిని ధీటుగా ఎదుర్కునేందుకు చేస్తోన్న ప్రయత్నాలేమిటి? గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయం కొడంగల్ నియోజకవర్గం పై కేంద్రీకృతమైంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆ రాజీనామా పత్రాన్ని కూడా పార్టీ అధినేత చంద్రబాబుకే ఇచ్చి వచ్చారు. దీంతో కొడంగల్ కు ఉప ఎన్నిక ఖాయం అని అంతా భావించారు. ఆ రాజీనామా పత్రం ఇంకా స్పీకర్ కు చేరనేలేదు. చేరుతుందో లేదో స్పష్టత లేదు. అయినా, అధికార టీఆర్ఎస్ అన్నీ హంగులతో ముందుగానే కొడంగల్ లో తిష్టవేసింది. ఆ నియోజకవర్గం పై ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఆకర్ష్ పేరుతో స్థానిక నేతలను గులాబీ గూటికి చేర్చే పని పెట్టుకుంది. టీఆర్ఎస్ కు కంట్లో నలుసులా మారిన రేవంత్ రెడ్డిని ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి రాకుండా చేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఆ దిశగా నియోజకవర్గం పై పట్టుకోసం అధికార పార్టీ..పావులు కదిపింది. ఉప ఎన్నిక తో నిమిత్తం లేకుండా మంత్రి హరీష్ కు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. తద్వారా కొడంగల్ పై తానెంత సీరియస్ గా ఉన్నానో చెప్పకనే చెప్పారు. సీఎం ఆదేశాలే తరువాయి హరీష్ రంగంలోకి దిగేశారు. మొదట చేరికల పై దృష్టి పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధలను వల వేశారు. ఆ తర్వాత నియోజకవర్గం లో కుల సమీకరణాలను లెక్క కట్టారు. ఆయా కులాల ప్రతినిధులను హైదరాబాద్ కు పిలిపించుకుని మాట్లాడారు. గ్రామంలో నాలుగు ఓట్లను ప్రభావితం చేస్తారనుకున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే ప్రయత్నం చేశారు. గులాబీ వ్యూహాలను అమలు చేసేందుకు సుమారు 60 మంది నేతలను నియోజకవర్గంలో రంగంలోకి దించినట్టు సమాచారం.  టీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు రేవంత్ కూడా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎదురులేని నేతగా ఎదిగిన ఆయన తాజాగా కాంగ్రెస్ కండువాతో కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి పార్టీ పరంగా కంటే వ్యక్తిగత ఇమేజ్ తోనే నియోజకవర్గం పై రేవంత్ పట్టు సాధించారు. తాజాగా టీఆర్ఎస్ వ్యూహాన్ని చేధించి, నియోజకవర్గం పై తన పట్టు నిలుపుకునే పనిలో రేవంత్ నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ స్పీడుకు బ్రేకులు వేయడం, ఉప ఎన్నిక వచ్చినా ధీటుగా ఎదుర్కోవడం అనే లక్ష్యాలతో నియోజకవర్గంలో ఆయన కార్యచరణ మొదలైంది. అందులో భాగంగా ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో తొలి విడత యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు ఇప్పటికే. వారానికి ఒక మండలంలో  రెండు రోజుల చొప్పున అన్నీ గ్రామాలను చుట్టి, కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నారు. మొత్తంగా..అయిదు వారాల పాటు ఈ కార్యక్రమం ఉండబోతోంది. తొలి విడతగా బొమరాస్ పేట మండలంలో  గత నెల 28,29 తేదీలలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాజాగా ఆరు, ఏడు తేదీలలో దౌల్తాబాద్ మండలంలో రేవంత్ ఊరువాడా తిరుగుతున్నారు. ఆ తర్వాత కోస్గీ, కొడంగల్, మద్దూరు మండలాల్లో ఇదే తరహా కార్యక్రమం చేయబోతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, తనతో పాటు తెలుగుదేశం నుంచి వచ్చిన ఇద్దరు స్థానిక నేతలతో ఇప్పటికే అయిదు మండలాలకు సమన్వయ కమిటీలు వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య సమన్వయంతో పాటు ఉప ఎన్నిక వస్తే సిద్ధంగా ఉండటం కోసమే రేవంత్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు నియోజకవర్గంలో టీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టి తన పట్టును యథాతథంగా నిలబెట్టుకునేందుకు ఈ పర్యటనలోనే ముఖ్య నాయకులకు రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11056
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author