తెలుగు ప్రతినిధులకు పోచంపల్లి  డిజైన్‌ శాలువలు

తెలుగు ప్రతినిధులకు పోచంపల్లి  డిజైన్‌ శాలువలు
December 09 12:35 2017
ప్రపంచ తెలుగు మహాసభకు హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం పోచంపల్లి శాలువలతో గౌరవించనుంది. పోచంపల్లి ‘ఇక్కత్’ డిజైన్‌కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు లభించగా అనేక అంతర్జాతీయ వేదికల ద్వారా విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మరోసారి పోచంపల్లి వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం కలుగుతోంది. దేశ విదేశాల నుంచి మహాసభలకు తెలుగు భాషాకోవిదులు, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు వందలాది మంది ప్రతినిధులుగా హాజరవుతున్నందువల్ల వారికి పోచంపల్లి శాలువలతో స్వాగతం పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పోచంపల్లిలోని చేనేతకారులకు, సొసైటీలకు తయారీ ఆర్డర్లను ‘టెస్కో’, పర్యాటక శాఖలు పది రోజుల క్రితమే ఇచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి, గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు, ఐఐటీ స్నాతకోత్సవానికి… ఇలా పలు సందర్భాల్లో పోచంపల్లి పట్టు శాలువలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా ఇదే ఒరవడి కొనసాగుతూ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సుమారు 300 శాలువలను, గ్లోబల్ సమ్మిట్‌కు సుమారు 300, ఐఐటీ స్నాతకోత్సవానికి సుమారు 150 పట్టు శాలువలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించినట్లు తెలిసింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉండేందుకు తెలుపు, ఎరుపు రంగులను శాలువాలకు వినియోగించాల్సిందిగా పర్యాటక శాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపినట్లు రమేష్ వివరించారు. పది రోజుల క్రితమే తమకు తయారీఆర్డర్లను ఇచ్చారని, మరికొద్దిమంది చేనేతకారులకుసైతం కాటన్ శాలువల ఆర్డర్లను ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కప్పిన శాలువాను తమ సంఘం కార్మికులే నేశారని, ఆ శాలువను చూసి ప్రధాని ముగ్ధుడయ్యాడని, ఇది కార్మికులకు, ఇక్కత్ డిజైన్‌కు దక్కిన గౌరవమని రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని తన ప్రసంగం ముగిసేంత వరకు ఈ శాలువను ఒంటిపైనే ఉంచుకున్నారని, భద్రతా సిబ్బంది తీసుకోడానికి ప్రయత్నించినా మోడీ సున్నితంగా నిరాకరించారని, ఇది డిజైన్ గొప్పదనం అని రమేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశ విదేశీ ప్రతినిధులు తెలుగు మహాసభలకు హాజరవుతున్నందువల్ల మరోసారి ఇక్కత్ వస్త్రాలకు ముగ్ధులయ్యే సందర్భం వచ్చిందని, అంతర్జాతీయ కార్యక్రమానికి ఇక్కత్ శాలువలను వినియోగించడం గర్వకారణంగా ఉందని అన్నారు. గతేడాది కాలంగా పలు సందర్భాలకు ఇక్కత్ శాలువలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తూ ఉన్నదని, ఇదే ఒరవడిని ఇకపైన కూడా కొనసాగించినట్లయితే చేనేతకార్మికులకు ఆర్థికంగా సాయం చేసినట్లవుతుందని, వారి జీవనోపాధికి భరోసా ఉంటుందని రమేష్ వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11211
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author