బెజవాడ కాదు.. భవనాలవాడ

బెజవాడ కాదు.. భవనాలవాడ
December 09 23:06 2017
కృష్ణాజిల్లా,
రాజధాని నగరంలో హైరైజ్‌ (మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్‌) నిర్మాణ సంస్కృతి పెరిగింది. అపార్ట్‌మెంటు సంస్కృతి నుంచి నిర్మాణదారులు క్రమేణా హైరైజ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయా? అన్నట్లు ఉండే ఈ హైరైజ్‌ కల్చర్‌ నానాటికీ పెరుగుతోంది.
 సుమారు 16 అంతస్తుల కంటే ఎక్కువగా… నిర్మాణాల్లో రెసిడెన్షియల్‌ భవనాలతోపాటు కమర్షియల్‌ కూడా నిర్మితమవుతున్నాయి. నగరంలో దాదాపు ఆరు భవనాలు నిర్మితమవుతుండగా, వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు 20 హైరైజ్‌ భవనాలు ఆకట్టుకుంటున్నాయి. జయభేరి, మంజీరా, అపర్ణ, సాహితీ, క్యాపిటల్‌ 1, ఎల్‌ఈపీఎల్‌, ఉండవల్లి, రామకృష్ణ వంటి పలు భారీ నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి.  ఈ భవనాలు నగరం కంటే వారధి తరువాత ప్రాంతంలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. ఏడాది క్రితం కార్పొరేషన్‌ పరిధిలో అనుమతుల కోసం ప్రతి రెండు నెలలకు ఒక దరఖాస్తు వీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ (ఆన్‌లైన్‌) విభాగానికి చేరేది. అనంతరం దరఖాస్తులు తగ్గుముఖం పట్టగా, నాలుగు నెలలుగా ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. సీఆర్‌డీయే పరిధిలో ఈ నిర్మాణాలు భారీగా ఊపందుకున్నాయి. ఏడాది క్రితం మంగళగిరి ప్రాంతాన్ని చూసిన వారికి ఇప్పుడు అది ఒక మహానగరంగా దర్శనమిస్తోంది. జాతీయ రహదారికి ఆనుకుని నిర్మితమవుతున్న భారీ అంతస్తుల భవనాలు అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదంటేనే అక్కడి నిర్మాణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తుంది.
నగరంలో భారీ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలు తగ్గడం, ఏటా భూమి విలువ పది శాతం పెరుగుతుండడం, అపార్ట్‌మెంట్ల కంటే అధికంగా హైరైజ్‌ బిల్డింగ్‌లకు సెట్‌బ్యాక్‌ వదలాల్సి రావడం వంటి పలు కారణాల వల్ల నగర పరిధి కంటే మంగళగిరి ప్రాంతాన్నే నిర్మాణదారులు ఎంచుకుంటున్నారు. స్థల విస్తీర్ణంలో పది శాతం టాట్‌ లాట్‌ (పిల్లలు ఆడుకునేందుకు) ఎమ్యూనిటీ (ఫంక్షన్‌ హాళ్లు) వంటి పలు అవసరాల కోసం స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. నగరంలో భూమి విలువ అధికంగా పెరిగిపోయిన కారణంగా అంత స్థలాన్ని వదిలి నష్టపోయే బదులు మరో నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చని నిర్మాణదారులు భావిస్తున్నారు. సుమారు పదిహేను అంతస్తులకు పైగా 200-300 ఫ్లాట్లతో నిర్మించే భవనాలకు అనువైన స్థలాలు అందుబాటులో లేవని కొందరు నిర్మాణదారులు చెబుతున్నారు. ఒకవేళ స్థలాలు దొరికినా శివార్లలో ఉంటున్నాయని, అక్కడ మౌలిక వసతుల కల్పనకు కొంత సమయం పడుతుందని, ఈలోపు ఇతర ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యే దశకు చేరుతున్నాయని అంటున్నారు. ఈ సమస్యల కారణంగా భారీ అంతస్తుల నిర్మాణాలకు మంగళగిరి ప్రాంతం వైపే నిర్మాణదారులు మొగ్గు చూపుతున్నారు. అమరావతికి చేరువగా ఉండే భవనాలకు గిరాకీ ఉందని, ఆక్యుపెన్నీ శాతం కూడా అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇటీవల అపార్ట్‌మెంటు కల్చర్‌ నగరంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. సాదాసీదాగా ఉన్న కాలనీలయిన నాగార్జుననగర్‌, కరెన్సీనగర్‌, హైటెన్షన్‌ లైన్‌ రోడ్డు వంటి ప్రాంతాలు నేడు అపార్ట్‌మెంటు కల్చర్‌కు నిలువెత్తు నిదర్శనంలా మారాయి. 62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర జనాభా సుమారు 12 లక్షల్లోపే. భూమి విలువ పెరుగుతున్న నేపథ్యంలో నగరవాసులు క్రమంగా ఆపార్ట్‌మెంటు కల్చర్‌కు అలవాటుపడ్డారు. ఈ సమయంలో హైరైజ్‌ భవనాల వైపు దృష్టి మరల్చే ప్రయత్నాలు పెద్దగా సాగడంలేదనే చెప్పాలి. నగరం రాజధానిగా మారిన తరుణంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారిలో అధిక శాతం శుక్రవారం వరకు నగరంలో ఉంటూ శని, ఆదివారాలు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. దీంతో నగరంలో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగినంతగా స్థిర నివాసాలకు పెరగలేదనే చెప్పాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11384
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author