అంగ రంగ వైభవంగా తెలుగు మహాసభలు

అంగ రంగ వైభవంగా తెలుగు మహాసభలు
December 12 11:44 2017
హైద్రాబాద్
తొలిసారి జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లను చేస్తున్నారు. సభల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథులకు, హాజరయ్యే భాషాభిమానులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈనెల 15న ప్రారంభ కార్యక్రమం, 19న ముగింపు కార్యక్రమం జరగనున్నాయి. ప్రారంభకార్యక్రమానికి ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు హాజరవుతారు. ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ హాజరుకానున్నారు. రెండు కార్యక్రమాల్లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు.ప్రత్యేకించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనునిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాలు నిర్ణయాత్మకంగా, నిర్ణీతంగా ఉండాలని, ఇదో బహుముఖ కార్యక్రమం కనుక ఎక్కడా ఎలాంటి లోటు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించడంతో దానికి అనుగుణంగా లాల్ బహుదూర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం కార్యక్రమాలను ఆయా విభాగాల ఆధారంగా వేదికలను ఖరారు చేశారు. ప్రధాన కార్యక్రమాలు ఎల్ బి స్టేడియంలో జరుగుతాయి. కొన్ని రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియంతో పాటు మినీ ఆడిటోరియంలోనూ, మరికొన్ని లలిత కళాతోరణం, తెలుగు యూనివర్శిటీ ఎన్టీఆర్ ఆడిటోరియం, ప్రియదర్శిని ఆడిటోరియంతో పాటు నక్లెస్ రోడ్‌లో ఇంకొన్ని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వరకూ ఈ వేదికలపై సదస్సులు నిర్వహించి ముగిస్తారు. అనంతరం ఎల్ బి స్టేడియంలో ప్రతి రోజు సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. రంగురంగుల విద్యుద్దీపాల కాంతితోరణాల మధ్య ఈ కార్యక్రమాలకు అంతా హాజరయి వీక్షించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే స్వాగత తోరణాలు సిద్ధం కాగా, ఎల్ బి స్టేడియంలో సైతం ఏర్పాట్లను సోమవారం నాడు అధికారులు పర్యవేక్షించారు. ప్రధానంగా పార్కింగ్, ఫుడ్ కోర్టులపై దృష్టిసారించారు. అన్ని జిల్లాల నుండి భాషాభిమానులు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కలెక్టర్లు స్వయంగా రవాణా ఏర్పాట్లు చేసి వారిని హైదరాబాద్ తీసుకురావడం, తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్య ఆహ్వానితులకు , రిజిస్టర్ చేసుకున్న అతిథులకు, మహిళలకు, సాహిత్య వేదికల్లో పాల్గొనే ప్రముఖులకు వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న 2611 మందికి, ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న 4293 మందికి ఈ గ్యాలరీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఎల్‌బి స్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతో పాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు, పుస్తక ప్రదర్శన, విక్రయ శాలలు, హస్తకళల ప్రదర్శన శాలలు, పురావస్తుశాఖ ప్రదర్శన శాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఒక రోజు సంగీత విభావరి, ఒక రోజు పూర్తిగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11583
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author