పంచాయితీ ఎన్నికల దిశగా అడుగులు

పంచాయితీ ఎన్నికల దిశగా అడుగులు
December 12 12:06 2017
హైద్రాబాద్,
గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తాజాగా సర్క్యులర్‌ జారీచేసింది. సంబంధిత కసరత్తు కూడా ప్రారంభించింది. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాలవారీగా సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. వీటిని ఏ జిల్లాలో ఎప్పుడు జరపాలో కూడా సమాచారమిచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్నికలు రెండు మూడు నెలల ముందే జరిగేలా కన్పిస్తున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో గెలిచిన సర్పంచుల పదవీకాలం 2018 వచ్చే ఏడాది ఆగస్టు 1తో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జూన్, జూలైలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. రైతులు ఖరీఫ్‌ పనులలో తలమునకలుగా ఉంటారు. కాబట్టి ఏప్రిల్‌ లేదా మే లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని, అప్పటికి పరీక్షలు కూడా పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. గ్రామ పంచాయతీల జాబితాను వచ్చే నెలాఖరులోగా ఖరారు చేసి తర్వాత వార్డుల పునర్విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.రిజర్వేషన్లనూ ఖరారు చేయాలని కోరింది. పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాల రూపకల్పన, ముద్రణలను మార్చికల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఓటర్ల జాబితా తయారీకి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్‌ సామగ్రి, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఎన్నికల సంఘం సూచించింది. పంచాయతీల్లో వార్డుల సంఖ్యకు సమానంగా పోలింగ్‌ స్టేషన్లుండాలని పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుంది. 243 ఇ(3ఎ) అధికరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే వీలుంది. సెక్షన్‌ 13(2) ప్రకారం గడువుకు 3 నెలలు ముందే ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఈ మేరకు గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంఘం సన్నాహాలు చేస్తోంది.నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేసే పనిలో తలమునకలై ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో సంబంధిత బిల్లుకు ఆమోదముద్ర వేయించే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు పలు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 8,684 పంచాయతీలుండగా, మరో 4 వేల పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశముంది. ముఖ్యంగా తండాలను పంచాయతీలుగా మార్చనున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలున్నందున వాటికి ఏడాది ముందు పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా అన్నదీ చూడాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11590
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author