తుంగ’భద్రమేనా..?’ 

తుంగ’భద్రమేనా..?’ 
December 13 10:42 2017
అనంతపురం,
అంతంత మాత్రంగా మారిన ‘తుంగభద్ర డ్యామ్‌’పై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కర్ణాటకలోని సింగటలూరు డ్యామ్‌ – ఎత్తిపోతల పథకం తుంగభద్ర జలాశయానికి పెనుగండంగా మారనుంది. ఏపీకి రావాల్సిన వాటా నీటికి గండి పడనుంది. కేంద్ర జలవనరుల శాఖ నుంచి డీపీఆర్‌కు అనుమతులు రాకుండానే సింగటలూరును కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసేసింది. తుంగభద్ర డ్యామ్‌ ఎగువ ప్రాంతంలోని కొప్పాళ జిల్లా హువిన హడగలి వద్ద 1,635 అడుగుల ఎత్తులో 3 టీఎంసీల సామర్థ్యంతో సింగటలూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను కర్ణాటక నిర్మించింది. దీని నిర్మాణానికి మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కోరారు. వాస్తవానికి దీని సామర్థ్యం 3 టీఎంసీలే అయినప్పటికీ… డ్యామ్‌కు కుడి, ఎడమ కాలువలల్లో భారీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మోటార్లను ఏర్పాటు చేశారు.
2,145 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పంపులను 10 ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పంపుహౌ్‌సల నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తయింది. డ్యామ్‌కు ఎడమ వైపున ఉన్న కెనాల్‌ ద్వారా లిఫ్ట్‌ పద్ధతిలో 10 మోటర్ల నుంచి రోజుకు 1,186 క్యూసెక్కుల నీరు ఆయకట్టుకు పంపేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అవే మోటార్లను కుడి వైపు కాలువకు బిగిస్తే అంతే సామర్థ్యంలో నీటి పంపిణీ జరుగుతుంది. దీని ప్రకారం రోజుకు 2,500 క్యూసెక్కుల దాకా నీటిని పంపిణీ చేసుకోవచ్చు. నిర్మించిన డ్యామ్‌లో నిల్వ చేసే 3 టీఎంసీల నీటిని మాత్రమే పంపిణీ చేసుకునే విధంగా కాకుండా వర్షాలు కురిసి ఒకవైపు డ్యామ్‌లో నీరు చేరుతుండగా మరోవైపు నుంచి లిఫ్ట్‌ ద్వారా నీటిని ఆయకట్టుకు పంపిణీ చేసేలా డిజైన్‌ చేశారు. దీంతో ఒక వైపు నీటి లభ్యత, మరోవైపు నీటి పంపిణీ రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతాయి.
దీని ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర డ్యామ్‌కు చేరాల్సిన నీరు ఈ ఎత్తిపోతలవద్దే ఆగిపోతోంది. దీనివల్ల తుంగభద్ర జలాశయానికి ఏటా సుమారు 25 టీఎంసీల నీటి లభ్యత తగ్గిపోతున్నట్లు ఇంజనీరింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింగటలూరు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ లోపభూయిష్టంగా ఉందని కేంద్ర జలవనరులశాఖ వెనక్కు పంపింది. అయినా… కర్ణాటక సర్కారు నిర్మాణాలు ఆగలేదు.
ముఖ్యంగా బచావత్‌ ట్రైబ్యునల్‌-1 అవార్డు ప్రకారం కర్ణాటకకు కేటాయించిన 734 టీఎంసీల నీటిలోనే 21 టీఎంసీలు వాడుకునేలా సిగ్గి, సింగటలూరు, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు కర్ణాటక రూపకల్పన చేసుకుంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్నందున (బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన దానికి అదనంగా) కృష్ణా బేసిన్‌లో ఆ మేరకు అదనపు నీరు అందుబాటులో ఉంటుందని కర్ణాటక కేంద్రానికి లేఖ రాసింది. దీంతో 10టీఎంసీ నీరు పునరుత్పత్తి అవుతాయన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా 23 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు కేటాయింపులు చేసుకుంది. తాజాగా మాస్టర్‌ప్లాన్‌ను సవరించి అందులో 1.5టీఎంసీలు షిగ్గాన్‌ ఎత్తిపోతల పథకానికి, 2.4టీఎంసీలు అప్పర్‌భద్ర పథకానికి, 18.55 టీఎంసీలు నీరు సింగటలూరుపథకానికి కేటాయించారు.
తుంగభద్ర డ్యామ్‌కు ఏటా 140 టీఎంసీల దాకా నీటి లభ్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఆంధ్రా వాటా కింద ఎగువ కాలువకు ఏటా 23 టీఎంసీలు వస్తాయి. అయితే, సింగటలూరు డ్యామ్‌తోపాటు లిఫ్ట్‌ పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే టీబీ డ్యామ్‌కు 100 టీఎంసీలకు మించి నీటి లభ్యత ఉండబోదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారం అనంతపురం జిల్లాకు జీవాధారమైన ఎగువ కాలువకు కేవలం 16 టీఎంసీలకు మించి నీరు అందే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. మరో మూడేళ్ల అనంతరం ఆంధ్రా వాటా కింద 15 టీఎంసీలకు మించి నీరు టీబీ డ్యాంనుంచి అందే పరిస్థితులు లేవని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తుంగభద్రకు ఎగువన ఉన్న సింగటలూరు ఎత్తిపోతల పథకం వల్ల భవిష్యత్తులో జిల్లాకు ఎగువ కాలువ నుంచి వచ్చే నీరు కేవలం తాగునీటికే సరిపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. పదేళ్ల లెక్కలను పరిశీలిస్తే తుంగభద్ర జలాశయంలో జూన్‌, జూలై నెలల్లో 44 టీఎంసీలు నిల్వ ఉండి, 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండాలి. కానీ.. ఈ ఏడాది 17 టీఎంసీలు నిల్వ ఉండి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. సింగటలూరు ఎత్తిపోతల పథకమే దీనికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక మితిమీరిన జల వినియోగంపై ఏపీ మేల్కొనకపోతే ఇబ్బందులు తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11709
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author