రేటు  పెరిగినా.. ఫేటు మారలేదు 

రేటు  పెరిగినా.. ఫేటు మారలేదు 
December 14 19:49 2017
గుంటూరు,
జిల్లాలో గతేడాది మిర్చి రైతాంగాన్ని ధర కుంగదీసింది. ఈ సంవత్సరం పత్తి రైతులను గులాబీ రంగు పురుగు వెంటాడి వేధించింది. ఇలా వాణిజ్య పంటలకు పేరుగాంచిన జిల్లాలో ప్రస్తుతం వారు పెట్టుబడులు తిరిగిరాక ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు. ఈసారి కూడా పత్తి సాగుదారుల పరిస్థితి దయనీయంగా మారింది. సాగు చేసిన రోజు నుంచి వర్షాలపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో మొక్కలు నిలువెత్తు పెరిగాయి. ఇది కొంత మేర సమస్యే అయినప్పటికీ లెెక్క ప్రకారం 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఆపైన ఎంతైనా రావచ్చు. అయితే గులాబీ రంగు పురుగు అంచనాలను తలకిందులు చేసింది. తీవ్రస్థాయిలో దాడి చేసి దిగుబడులు దిగజార్చింది. పంట చివరి దశకు రాగా ఈ ఏడాది మొదటి నుంచీ ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లకు దిగటంతో ధర ఫర్వాలేదనిపించింది. అయితే దిగుబడులే రైతన్నలను దెబ్బతీశాయి. దీంతో ధర బాగున్నా వారికి మిగిలేది లేదు. కొన్ని ప్రాంతాల్లో కౌలు రైతుకు కౌలు కూడా రాలేదు. పల్నాడులో కొన్ని మండలాల్లో ఇప్పటి వరకూ 7 క్వింటాళ్ల వరకూ వచ్చింది. చివరి దశలో రెండు క్వింటాళ్లు రావచ్చని అంచనా. రేగడి నేలలో 10 క్వింటాళ్లు వస్తుందని చెబుతున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో 7-10 క్వింటాళ్లలోపు దిగుబడి వచ్చింది. బాగా వచ్చిందనుకున్నది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. జిల్లాలో ఏడాది 4 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సీసీఐ 11 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది. ఇప్పటి వరకూ 694 మంది వద్ద 13,279 క్వింటాళ్లు రూ.5.68 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే సీసీఐకన్నా బయట మార్కెట్లోనే ధర ఎక్కువగా ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు రాలేదు. గ్రామాల్లోనే అమ్మేశారు. తాజాగా ధర రోజు రోజుకూ పెరుగుతుండగా రైతు దగ్గర పంట చివరి దశకు వచ్చింది. ఇంక ఎంత పెరిగినా పెట్టుబడి మాత్రం దక్కే పరిస్థితి ఈ ఏడాది లేదు. ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. 7 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ.4 వేల చొప్పున అమ్మినా పెట్టుబడే రాదు. ఇక కౌలు రైతుకు పెట్టుబడి రాకపోగా అదనంగా కౌలు దండగ. ఎకరాకు 8-10 క్వింటాళ్లు వచ్చిన ప్రాంతాల్లో పెట్టుబడులు అందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జిల్లాలో తాజాగా గ్రామాల్లోనే క్వింటా నాణ్యమైన పత్తి రూ.4100 కొనుగోలు చేస్తున్నారు. ఇక గులాబీ రంగు పురుగు సోకిన పత్తిని ప్రైవేటు వ్యాపారులు రూ.3,600 కొంటున్నట్లు తెలిసింది. దెబ్బతిన్న పంటంతా దిగుబడులు ప్రారంభమైన మొదటిలోనే కావటంతో రైతులు బాగా నష్టపోయారు. చివరి దశలో వస్తున్న పంట నాణ్యత బాగుందని వ్యాపారులు రూ.4,100 వరకూ ధర ఇస్తున్నారు. అయితే ఇక మహా వస్తే రెండు క్వింటాళ్లకు మించి రాదని రైతులు చెబుతున్నారు. ధర పెరిగింది. దిగుబడులు అయిపోయాయి. చివరకు తమకు దిగులే మిగిలిందని వాపోతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12013
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author