సంక్రాంతి బాదుడుకు అంతా సిద్ధం

 సంక్రాంతి బాదుడుకు అంతా సిద్ధం
December 14 21:08 2017
కాకినాడ,
సంక్రాంతి బాదుడుకు అంతా సిద్ధమైంది. పెద్ద పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చే జిల్లా వాసులను రవాణా ఛార్జీల రూపంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ రిజర్వేషన్‌ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేసింది. ప్రత్యేక బస్సుల పేరిట సాధారణ టిక్కెట్టు ధరపై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనుండగా, రద్దీని బట్టి రెండు నుంచి మూడు రెట్లు వరకు టిక్కెట్టు ధర వసూలు చేసే యోచనలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఉన్నాయి.మరోపక్క రైళ్లలోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ పెరిగిపోవడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు పెద్ద పండుగ సందర్భంగా జిల్లాకు రావడం పరిపాటి. ఈ క్రమంలో  సంక్రాంతి పండుగ ప్రారంభానికి ఐదు రోజుల ముందు నుంచీ ప్రయాణ రద్దీ మొదలవుతుంది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారితో దాదాపు వారం రోజులపాటు రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో దాదాపు రెండు వారాల పాటు ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారికి పెద్ద పండుగనే చెప్పాలి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, ఏలేశ్వరం, రాజోలు తదితర ప్రాంతాల నుంచి రోజూ హైదరాబాద్‌కు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన సుమారు 130 బస్సులు నడుస్తుండగా, ఆర్టీసీ సర్వీసులు 38 వరకూ నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో రూ. 600 నుంచి రూ.700, ఏసీ సర్వీసుకు రూ. 1000 వరకూ ఉంటుంది. రద్దీని బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులుంటుంటాయి. ఆర్టీసీ టిక్కెట్టు ధర రూ.680 వరకు ఉంటుంది. ఏసీ బస్సుకు రూ.950 వరకు ఉంటుంది. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీతో అదనపు టిక్కెట్టు ధరపై ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు.మూడు నెలల ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయం కల్పించిన ఆర్టీసీ సంస్థ పండుగ రద్దీ దృష్ట్యా రిజర్వేషన్‌ కాలపరిమితిని నెల రోజులకు కుదించేసింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇప్పటికే సైట్స్‌ మూసివేశాయి. ప్రత్యేకం పేరుతో జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ సంస్థ హైదరాబాద్‌కు దాదాపు 60 బస్సులు వరకు నడిపే ప్రయత్నంలో ఉంది. ప్రత్యేక బస్సుల ద్వారా రానుపోను అదనపు ధర రూపంలో దాదాపు రూ.80 లక్షల మేర ఆదాయం రాబట్టే పనిలో ఉన్నట్టు సమాచారం.ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరగనున్నట్టు ట్రావెల్‌ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఆయా ట్రావెల్స్‌ రిజర్వేషన్‌ చార్జీను ఇంకా తెరవలేదు. దసరా పండుగ సందర్భంగా రూ.2,500లు వరకు టిక్కెట్టు ధర పలికింది. అదే తరహాలో పండుగ ధరలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా రోజుకు సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో నాన్‌ ఏసీ బస్సులు 70 శాతం కాగా, మిగిలినవి ఏసీ బస్సులు. పండుగ రద్దీతో నాన్‌ ఏసీ ధరలు రూ.1200లు నుంచి రూ. 1600 వరకు, ఏసీ సర్వీసుకు రూ. 2000లు నుంచి రూ. 3000లు వరకు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వాసుల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. దోపిడీకి గురికాకుండా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. హైదరాబాద్‌కు 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జనవరి 12వ తేదీ నుంచి స్లీపర్‌తోపాటు థర్డ్, సెకండ్‌ ఏసీల వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడంత ఉంది. పండుగ రోజుల్లో మినహా, తిరుగు ప్రయాణానికి సంబంధించి 16వ తేదీ నుంచి వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌ నుంచి జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై రైల్వేశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం ప్రయాణికులను నిరాశకు గురిచేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12055
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author