మార్చి 1 నుంచి… సినిమా ధియేటర్ల బంద్

మార్చి 1 నుంచి… సినిమా ధియేటర్ల బంద్
December 16 12:33 2017
హైద్రాబాద్,
తెలుగు చిత్ర‌సీమ‌కు ఇదో షాక్‌. మార్చి 1 నుంచి థియేట‌ర్లు మూసివేయాల‌ని, నిర‌వ‌ధికంగా బంద్ నిర్వ‌హించాల‌ని తెలుగు చల‌న చిత్ర నిర్మాత‌ల మండలి తీర్మాణించింది. అంటే… తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 1 నుంచి సినిమా హాళ్లు మూత‌బ‌డుతున్నాయ‌న్న‌మాట‌. రెండు తెలుగు రాష్ట్రాల‌తో దాదాపు 1800 థియేట‌ర్లున్నాయి. వాటికి తాళాలు వేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. థియేట‌ర్లు మూసి వేస్తే నిర్మాత‌లు, పంపిణీదారులు, థియేట‌ర్ల‌పై ఆధార‌ప‌డుతున్న కుటుంబాలు, సినీ కార్మికులు అందరికీ న‌ష్ట‌మే. అయితే ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?? లేదంటే చిత్ర‌సీమ ఇదేదో వార్నింగ్ ఇచ్చి భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అస‌లు స‌మ‌స్య యూ ఎఫ్ వో, క్యూబ్ ప్రొవైడ‌ర్ల నుంచి వ‌చ్చింది. ప్రింట్ల సిస్ట‌మ్ నుంచి డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌కి మారాక యూ ఎఫ్ వో, క్యూబ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. వాటిని ఏర్పాటు చేసుకొనే స్థోమ‌త థియేట‌ర్ యాజ‌మాన్యానికి లేకుండా పోయింది. దాంతో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు రంగంలోకి దిగారు. క్యూబ్‌, యూ ఎఫ్ వో స‌ర్వీసుల్ని అందించి, అందుకు కొంత మొత్తం అద్దెగా స్వీక‌రించ‌డం మొద‌లెట్టారు. ఈ అద్దెలు కూడా.. నిర్మాత‌లే భ‌రించాల్సివ‌స్తోంది. ఇప్పుడు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల దోపిడీ హెచ్చుమీరుతోంది. వాళ్లు అడిగిన అద్దె ఇవ్వ‌లేక నిర్మాత‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఓ థియేట‌ర్‌ని అద్దెకు తీసుకుని, అందులోని సౌక‌ర్యాల‌కూ అద్దె చెల్లించ‌డం ఏమిటి? అదంతా థియేట‌ర్ల యాజ‌మాన్యాలే చూసుకోవాలి క‌దా అనేది నిర్మాత‌ల మాట‌. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు డ‌బ్బులిచ్చి, మేం థియేట‌ర్ల‌ను నిర్వ‌హించ‌లేం అని ప్ర‌ద‌ర్శ‌న కారులు చెబుతున్నారు. దాంతో స‌మ‌స్య తీవ్ర‌త‌రమైంది. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఈ రంగం నుంచి ప‌క్క‌కు త‌ప్పించాల‌న్న‌ది నిర్మాతల మండ‌లి ఆలోచ‌న‌. అందుకు సంబంధించి కొంత‌కాలంగా చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. కానీ అవేం స‌ఫ‌లం కాలేదు. దాంతో థియేట‌ర్ల బంద్ ఆలోచ‌న వ‌చ్చింది. థియేట‌ర్లు మూసి వేస్తే స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు అద్దె చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. వాళ్ల‌కు రాబ‌డి ఉండ‌దు. దాంతో వాళ్లే రాజీకి వ‌స్తార‌న్న‌ది వ్యూహం. కాక‌పోతే మార్చి నుంచి వేస‌వి సీజ‌న్ మొద‌ల‌వుతుంది. సినిమాల‌కు అదే… ఆయువు ప‌ట్టు. ఆ స‌మ‌యంలో థియేట‌ర్ల బంద్ అంటే.. అయ్యే ప‌ని కాదు. దాంతో ముడి ప‌డి ఉన్న మిగిలిన వ‌ర్గాలు థియేట‌ర్ల బంద్‌కి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే అవ‌కాశం ఉంది. అందుకే నిర్మాత‌ల మండ‌లి కూడా ఇప్ప‌టికిప్పుడు థియేట‌ర్ల బంద్ అని పిలుపు ఇవ్వ‌లేదు. మార్చి వ‌రకూ దాన్ని తీసుకెళ్లిపోయింది. ఈలోగా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న‌ది వాళ్ల ఆలోచ‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12343
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author