అనారోగ్య లక్ష్మీ 

అనారోగ్య లక్ష్మీ 
December 16 19:49 2017
కరీంనగర్,
అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులుగా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో.. భోజన నాణ్యత విషయంలో నిర్వాహకులు రాజీ పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకొచ్చే వారికి నామమాత్రంగా అంగన్‌వాడీ సేవలు అందుతున్నాయి. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం పర్వాలేదనిపిస్తున్నా.. పల్లె ప్రాంతాల్లో మాత్రం నిరాశజనకంగా ఉంటోంది. పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే పిల్లలకు రోజుకో గుడ్డు, పోషక విలువలున్న పదార్థాలతో మధ్యాహ్న భోజనం అందించాలి. కొన్ని చోట్ల అమలవుతున్నా.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా ఉన్నట్లు సమాచారం. కొందరు గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రాకుండానే.. వారికి అందించాల్సిన బియ్యం, గుడ్లు, పప్పు, నూనె తదితర వస్తువులన్నింటినీ నేరుగా ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ విధానం జిల్లాలో సర్వసాధారణమైపోయింది. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అంగన్‌వాడీలకు పంపకుండా.. ప్రైవేట్‌గా పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు. వారు కూడా నెలకు సరిపడా వస్తువులను కేంద్రాల నుంచి తీసుకెళ్తున్నారు. నెలకోసారి వైద్య సిబ్బంది కేంద్రాలకు వచ్చి పిల్లలకు వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా.. నేటికీ కొన్నిచోట్ల అలాంటివి అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాలో కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ గ్రామీణం, గంగాధర, హుజురాబాద్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 777 అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. 10097 మంది పిల్లలు కేంద్రాలకొచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. 10570 మంది గర్భిణులు, బాలింతలు హాజరవుతున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో వీరందరూ అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లడం లేదనడం బహిరంగ రహస్యమే. వీరిలో కొందరు తమకు రావాల్సిన వస్తువులను తీసుకెళ్తుండగా.. మరికొందరు అనాసక్తి చూపుతున్నారు. నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో కనీసం మూడో వంతు కూడా సొంత భవనాల్లేవు. మొత్తం 777 కేంద్రాలకు 247 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. 284 అద్దె, 246 అద్దె చెల్లింపు రహిత భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో చాలావరకు శిథిల భవనాల్లోనే కొనసాగుతుండటం విశేషం. వీటిలో కనీసం పదో వంతు అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. ఇంకొన్ని కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యమూ కరవే. నల్లాలు లేకపోవడంతో.. అంగన్‌వాడీ సహాయకులు బిందెల్లో తాగునీరు తేవాల్సిన పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ భవనాలు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి రాకపోకలకు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రానికొచ్చే ప్రతి చిన్నారికి రోజుకో గుడ్డు, 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనెతో మధ్యాహ్న భోజనం అందించాలి. అలాగే బాలింతలు, గర్భిణులకు గుడ్డుతో పాటు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనెతో భోజనం పెట్టాలి. గురు, శనివారాల్లో 100 గ్రాముల పెరుగు అదనం. ఉదయం 10 గంటలకు గుడ్డు అందించిన తరవాత మధ్యాహ్నం ఒంటిగంటలోపు భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెరిగిన కూరగాయల ప్రభావంతో.. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన, రుచికర భోజనం అందించకపోతున్నారు. ధరలు పెరిగినప్పుడూ.. ప్రభుత్వ ధరలే ఇస్తుండటంతో.. నిర్వాహకులు ఆ మేరకొచ్చే కూరగాయలతో వంట చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌కూ పిల్లల సంఖ్యతో ముడిపెట్టడంతో.. ప్రతి రెణ్నెల్లకోసారి రూ.600 మేర అంగన్‌వాడీ కార్యకర్తలపై భారం పడుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12411
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author