డిసెంబర్ 25 తర్వాత కొత్త సీఎంలు 

డిసెంబర్ 25 తర్వాత కొత్త సీఎంలు 
December 20 16:16 2017
గాంధీనగర్,
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో గెలుపొందిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు సన్నద్ధం అవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీఎంల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఒక బృందాన్ని గుజరాత్‌కు పంపిన బీజేపీ అధిష్టానం.. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు పంపింది. వీరిద్దరూ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.ఎన్నికల ఫలితాల సరళి తెలిసిన వెంటనే సెంట్రల్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో భేటీ అయ్యింది. గుజరాత్‌ సీఎం ఎంపిక బాధ్యతను అరుణ్ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండేకు అప్పగించినట్లు ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. హిమాచల్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను నియమించారు. వీరు ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎంలను ఎన్నుకోనున్నారు.ఎన్నికల ప్రచారం సమయంలో ప్రస్తుత గుజరాత్ సీఎం విజయ్ రూపానీకే మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తామని పార్టీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కానీ బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం కావడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు కొత్త సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి.హిమాచల్ సీఎం అభ్యర్థిని బీజేపీ ముందే ప్రకటించింది. కానీ ప్రేమ్ కుమార్ ధుమాల్ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో మరో నాయకుణ్ని సీఎంగా ఎంపిక చేసే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు.’ఇదొక పెద్ద విజయం. ఇప్పుడు మనం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం’ అని ప్రధాని నరేంద్రమోదీ తన పార్టీ సీనియర్‌ నేతలతో అన్నారు. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ముందుగా పార్టీ నేతలందరికీ నమస్కరించారు. ‘1980లో మనవి రెండు సీట్లు. ఇప్పుడు ఏకంగా 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఇది పెద్ద విజయం. ఆఖరికి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పడు కాంగ్రెస్‌ పార్టీ 18 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ ఆనందంతో ఎవరూ అతిగా ఉప్పొంగవద్దు’ అని సూచించారు.  ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12642
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author