దిద్దుబాటు చర్యల్లో  గ్రేటర్ కార్పొరేషన్

 దిద్దుబాటు చర్యల్లో  గ్రేటర్ కార్పొరేషన్
December 20 22:47 2017
హైద్రాబాద్,
మహానగరంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రోడ్ల నిర్మాణ పనులను పక్కాగా చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే బల్దియా పనులంటనే బాబోయ్ అంటూ కాంట్రాక్టర్లు పరుగులెత్తటంతో రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సైతం కాంట్రాక్టర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. కాంట్రాక్టర్లలో కొందరు పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్లటం, మరికొందరు టెండర్ల ప్రక్రియలో కూడా పాల్గొనకపోటంతో కొన్ని పనులకు నాలుగైదు సార్లు కూడా టెండర్లను ఆహ్వానించిన సందర్భాలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు రూ. 710 కోట్ల వ్యయంతో 624 రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఇటీవలే నిర్వహించిన టాస్క్ఫోర్సు సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే! అయితే రోడ్డు నిర్మాణ పనులు పారదర్శకంగా, జరగటంతో పాటు సకాలంలో పూర్తి చేసేందుకు గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు ప్రత్యేక టాస్క్ఫోర్సును నియమించిన తర్వాత ఇలాంటి లోపాలు పునరావృతం కారాదంటూ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు అధికారులు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించే విషయంలో ఆచితూచి వ్వవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్లు నెలకు రూ. 168 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టే సామర్ధ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొందరు కనిష్టంగా రూ. ఐదు కోట్లు, గరిష్టంగా రూ. 20 కోట్ల వరకు పనులు చేసేవారున్నారు. ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు నేరుగా సంప్రదింపులు జరుపుతూ పనులు చేపట్టేందుకు తమ సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి లిఖితపూర్వకమైన పత్రాలను కూడా రాయించుకుంటున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్ల సామర్థ్యానికి తగిన విధంగా పనులను అప్పగిస్తే పనులు సక్రమంగా జరగటంతో పాటు సకాలంలో పూర్తవుతాయని వారు భావిస్తున్నారు. మొత్తం రూ. 710 కోట్ల వ్యయంతో చేపట్టదల్చుకున్న 625 రోడ్ల నిర్మాణ పనుల్లో రూ. 280 కోట్ల వ్యయంతో 314 బిటీ రోడ్లు, రూ. 260 కోట్ల వ్యయంతో 258 సీసీ రోడ్లు, రూ. 40 కోట్ల వ్యయంతో వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. రూ. 28 కోట్ల వ్యయంతో లేన్ మార్కింగ్, రేడియం లైటింగ్ తదితర పనులను చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వచ్చే మార్చి నెలాఖరులోపు ఈ 625 రోడ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ముందుకెళ్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12766
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author