అక్కడ వైసీపీ గల్లంతేనా.. 

అక్కడ వైసీపీ గల్లంతేనా.. 
December 25 15:24 2017
విశాఖ,
విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న మన్యంలో ఆ పార్టీ కోటలు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో అరకులోయ ఎంపీ, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరితరువాత మరొకరు పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకోగా, ఎంపీ తటస్థంగా వున్నట్టు చెబుతున్నారు.
దీంతో మన్యంలో వైసీపీ బాగా బలహీన పడింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా వారి బాటలోనే నడుస్తుండడంతో వైసీపీ నానాటికీ బక్కచిక్కిపోతున్నది. కొన్ని మండలాల్లో కేడర్‌ మొత్తం టీడీపీలో చేరడంతో అక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని ముందుకు తీసుకెళ్లేవారు లేకుండా పోయారు. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితినిబట్టి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయబావుటా ఎగురవేయడం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు వుండగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అరకులోయ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఏజెన్సీలోనే వుండడం గమనార్హం. అరకులోయ ఎంపీగా కొత్తపల్లి గీత, అరకులోయ ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి భారీ మెజారిటీలతోనే గెలుపొందారు. కానీ అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ గీత మూడేళ్ల క్రితమే వైసీపీకి టాటా చెప్పారు. రెండేళ్ల క్రితం కిడారి, గత నెలలో గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కిడారితోపాటు వైసీపీ కేడర్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో టీడీపీలో చేరలేదు.
కానీ గిడ్డి ఈశ్వరితోపాటు పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండల/గ్రామస్థాయి వైసీపీ నేతలు అధికార పార్టీలో మూకుమ్మడిగా చేరారు. తరువాత పెదలబుడు(అరకులోయ) సర్పంచ్‌, ఇంకా అరకు నియోజకవర్గంలో పలువురు నాయకులు కూడా తెలుగుదేశంలో చేరారు. పాడేరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. దీంతో వైసీపీ అధిష్ఠానం అంతర్మథనలో పడింది. తాజాగా 19వ తేదీ మంగళవారం చింతపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గడుతూరు సర్పంచ్‌ చిన్నుదొర, జి.మాడుగుల వైస్‌ఎంపీపీ కొర్ర ఊర్మిళతోపాటు వార్డు సభ్యులు, నాయకులు టీడీపీలో చేరారు.
ఐకమత్యంగా సాగుతున్న పాత, కొత్త కేడర్‌ పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో అనాదిగా ఉన్న నాయకులతోపాటు కొత్తగా వైసీపీ నుంచి చేరిన ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతూ, ఐకమత్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీ నానాటికీ బలోపేతం అవుతున్నది. వైసీపీ అధిష్ఠానం తనను తీవ్రంగా అవమానిందని రగిలిపోతున్న గిడ్డి ఈశ్వరి, పాడేరు నియోజకవర్గంలోవిస్తృతంగా పర్యటిస్తూ, సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ, వైసీపీకి చెందిన కార్యకర్తలను కూడా తెలుగుదేశంలో చేరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాడేరు నియోజకవర్గంలో వైసీపీని ముందుకు నడిపే నేత లేకుండా పోయారు.
 గిడ్డి ఈశ్వరి సుమారు నెల రోజుల క్రితం టీడీపీలో చేరగా, ఇంతవరకు పాడేరు నియోజకవర్గానికి వైసీపీ అధిష్ఠానం ఇన్‌చార్జిని నియమించలేకపోవడం గమనార్హం. ఉన్న కొద్దిపాటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వున్నారు. పైగా మాజీ మంత్రి బాలరాజుని వైసీపీలో చేర్చుకుంటే, తాము పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు. అరకులోయ వైసీపీలో కూడా ముసలం పుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇన్‌చార్జిగా శెట్టి ఫాల్గుణ వున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ నీకే ఇస్తామని అధిష్ఠానం చెప్పడంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును వైసీపీలో చేర్చుకుని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో ప్రస్తుతం వున్న ద్వితీయశ్రేణి నేతులు, మాజీ సమన్వయకమిటీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుంభా రవిబాబు విషయంలోనే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకేవేళ రవిబాబు వైసీపీలో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడం జరిగితే, ప్రస్తుతం వున్న కేడర్‌ మొత్తం ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏజెన్నీలో తెలుగుదేశం పార్టీ చిట్టచివరిసారిగా 1999లో పాడేరు, చింతపల్లిల్లో గెలుపొందింది. తరువాత పార్టీ బలహీన పడడం, ఇతర పార్టీలతో పొత్తుల కారణంగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు టీడీపీలో చేరడం, ఎంపీ ఎప్పటి నుంచో వైసీపీకి దూరంగా వుండడంతో వచ్చే ఎన్నికల్లో ఏజెన్సీలోని మూడు స్థానాల్లో(ఎంపీ, ఎమ్మెల్యేలు) గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చిందని అంటున్నారు. పాడేరు టిక్కెట్‌ ఈశ్వరికే ఖాయమని అంటున్నారు. ఆమె బలమైన భగత తెగకు చెందిన వ్యక్తి కావడంతోపాటు, గిరిజనేతరుల మద్దతు కూడా వుంది. అరకులోయ అభ్యర్థిపై స్పష్టత ఇంకా రాలేదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏజెన్సీలో టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13342
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author