యథేచ్ఛగా ఉల్లంఘనలు.. నిబంధనలకు నీళ్లు..

యథేచ్ఛగా ఉల్లంఘనలు.. నిబంధనలకు నీళ్లు..
December 25 15:44 2017
కర్నూలు,
కర్నూలు జిల్లాలో గనుల తవ్వకాలు నిర్వహిస్తున్న పలువురు నిబంధనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలు నిర్వహిస్తున్నా రూ.కోట్లు దండుకుంటున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, గడివేముల లాంటి చోట్ల ఉల్లంఘనలు పెద్దఎత్తున చోటుచేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా సాగిపోతోందని అంటున్నారు. జిల్లాలో లీజులకు కేటాయించిన గనుల దాదాపు 1,250 హెక్టార్లలో ఉన్నాయి. ఇందులో బనగానపల్లి పరిధిలోనే 950 హెక్టార్లు ఉన్నాయి. ఇవి అధికారికంగా ఇచ్చిన లీజులు. కానీ కొందరు అక్రమార్కులు లీజు లేని ప్రాంతాల్లోనూ తవ్వకాలు సాగించేస్తున్నారు. లీజు తీసుకున్న  యజమాని ఒక్కో హెక్టార్‌కు ఏడాదికి డెడ్‌ రెంటు కింద సుమారు రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. లీజు లేకుండా తవ్వకాలు సాగించడంతో గుంతలు ప్రమాదకరంగా మారడమేకాక ప్రభుత్వ ఆదాయానికి భారీగా కోత పడుతోంది.
ప్రస్తుతం ఏటా గనుల శాఖకు ఏడాదికి సుమారు రూ.60 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. అక్రమ లీజులతో ప్రభుత్వానికి దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నట్లు ప్రాథమిక అంచనా. నిబంధనల ప్రకారం రహదారులకు అత్యంత సమీపంలో గనుల తవ్వకాలు సాగించకూడదు. అయితే పలువురు అక్రమార్కులు నిత్యం రహదారుల పరిధిలోనే యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ మార్గాల్లో అధికారులు తిరుగుతున్నా.. పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటుండడంతో తవ్వకాలు సర్వసాధారణమైపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని నిబంధనల అతిక్రమణలు ఇకమీదట తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13351
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author