ఘనంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు

ఘనంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు
December 25 18:13 2017
తిరుమల,
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు లక్ష మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. టీటీడీ ఏర్పాట్లలో భద్రతా పరమైన అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలిస్తే భక్తుల సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఈసందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున 1.72లక్షల మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించే సౌలభ్యం ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించి ఉదయం 7 గంటలకు స్వామివారి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. అప్పటినుంచి నిరంతరాయంగా 18 గంటలు సామాన్యభక్తులకు దర్శన సౌకర్యం ఉంటుందన్నారు. రెండోరోజు మరో 24 గంటలకు సామాన్యభక్తులకు దర్శన సౌకర్యం ఉంటుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న క్యూలైన్‌లే కాకుండా 20 షెడ్లను అదనంగా కూడా నిర్మించామన్నారు.ఈ షెడ్లలో 20వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉందన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్‌లో ఉన్న వారిని నూతనంగా కర్ణాటక సత్రం వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్‌ల ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటుచేశామన్నారు. అహోబిలం మఠం ఎదురుగా ఉత్తర మాడవీధిలోని పైభాగం ఎ-టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి మీదుగా 3వ రింగ్‌రోడ్డు మార్గం నుంచి కల్యాణవేదిక వరకు లైన్‌లు నిర్మించామన్నారు. వెలుపల ఉన్న ఈ క్యూలైన్‌లలో 42వేల మంది , షెడ్లలో 20వేలు, వైకుంఠం కాంప్లెక్స్‌లో 32వేలు, వైకుంఠం-1లో 16వేల మంది భక్తులు కూర్చోవడానికి అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో 28వ తేదీన ఉదయం 7 గంటలకు వైకుంఠం కాంప్లెక్స్‌లో ప్రవేశించిన వారు 24 గంటల పాటు సహనంతో కూర్చోవాల్సి ఉంటుందన్నారు. భక్తులకు అవసరమైన అల్పాహార, భోజన, కాఫీ, టీ, నీళ్లు వంటి వసతులను నిరంతరం శ్రీవారి సేవకులు అందిస్తూ ఉంటారన్నారు. ప్రాధమిక వైద్యకేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్యదర్శనం లాంటి వసతులను రద్దుచేసి ఉచిత క్యూలైన్‌లో వెళ్లే భక్తులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నామన్నారు. ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పోలీసులు మరోవైపు టీటీడీ నిఘాభద్రతా విభాగం సిబ్బంది భక్తుల భద్రతకు సంబంధించి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు. ఎస్పీ అభిషేక్‌మహంతి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏ యేడాది కాయేడాది పెరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే 1400 మంది పోలీస్ సిబ్బందిని తిరుమలలో సేవలందించడానికి నియమిస్తున్నామన్నారు. అర్బన్ జిల్లాల పరిధిలో అనేక ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల తాకిడి ఉంటుందని, వారి భద్రతకు కూడా ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. వైకుంఠ కాంప్లెక్స్ ఆలయం లోపల రద్దీ యాజమాన్యాన్ని టీటీడీ సిబ్బంది, నిఘా, భద్రతాధికారులు పర్యవేక్షిస్తుంటారన్నారు. తిరుమలకు వచ్చే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ఇప్పటికే కొన్ని ప్రదేశాలను ప్రత్యేకంగా కేటాయించామన్నారు. నేర నియంత్రణ కోసం ప్రత్యేకంగా క్రైం పోలీసుల బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఫింగర్ ప్రింట్స్ సిస్టమ్ ద్వారా పాత నేరస్తులను గుర్తించి ముందుగా అదుపులోకి తీసుకుంటామన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13418
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author