ఇదో తంటా.. 

ఇదో తంటా.. 
December 27 10:47 2017
అమరావతి,
పారదర్శకత పేరుతో ఉన్నతాధికారులు చేపడుతున్న చర్యలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాపు కార్పొరేషన్‌ ద్వారా విద్యార్థులకు ఇప్పిస్తున్న సివిల్స్‌ కోచింగ్‌లో ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతున్నాయి. పేద కాపు, తెలగ, బలిజ, ఒంటరి యువతకు కార్పొరేషన్‌ విద్యోన్నతి కింద సివిల్స్‌కు ఉచితంగా కోచింగ్‌ ఇప్పిస్తోంది. 2016-17లో 450 మందికి కోచింగ్‌ ఇప్పించగా.. 2017-18లో 750 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇటీవల అభ్యర్థులను ఎంపిక చేసింది. కోచింగ్‌కు ఎంప్యానెల్‌ చేసిన ఇన్‌స్టిట్యూట్లలో ఇటీవల శిక్షణ ప్రారంభమైంది. ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లిస్తున్నారు. ఈ మేరకు ఆయా ఇన్‌స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకున్నారు.
గతేడాది ఫీజులను రెండు విడతలుగా నేరుగా ఇన్‌స్టిట్యూట్లకు చెల్లించారు. కానీ వారికి ఖాతాలకు ఫీజులు కట్టడం సమంజసం కాదని, అభ్యర్థుల ఖాతాలకే ఫీజులు జమచేస్తే వారే కట్టుకుంటారనే కొత్త విధానానికి బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో కార్పొరేషన్‌కు, ఇన్‌స్టిట్యూట్లకు మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందం తెగిపోయింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఫీజులు కడతారో లేదోనన్న అనుమానంతో ఇన్‌స్టిట్యూట్లు చెక్కులు కావాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించాయి.
ఈ ఏడాది నుంచి మూడు విడతలుగా ఫీజులు చెల్లించాలని నిర్ణయించిన నేపథ్యంలో రూ.30 వేలు, రూ.30 వేలు, రూ.40 వేలకు వేర్వేరుగా చెక్కులివ్వాలని అడుగుతున్నాయి. లేకపోతే కార్పొరేషన్‌ ఫీజులు విడుదల చేసినా రేపు అభ్యర్థులు ఫీజులు సక్రమంగా చెల్లిస్తారనే గ్యారెంటీ ఉండదన్నది వాటి వాదన. చెక్‌లు సమర్పించే విధానాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. చెక్‌లు ఇస్తే కోచింగ్‌ ఎలా ఉన్నా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు సకాలంలో ఫీజులు చెల్లించలేదని ఇటీవల ఢిల్లీలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌ అభ్యర్థులకు కోచింగ్‌ నిలిపివేసింది. కార్పొరేషన్‌కు, ఇన్‌స్టిట్యూట్లకు మధ్య అవగాహన, ఒప్పందం ఉంటే ఫీజుల విడుదల ఆలస్యమైనా అభ్యర్థులపై ఒత్తిడి ఉండదు. గతేడాది సివిల్స్‌ కోచింగ్‌ ఫీజులు కూడా 50శాతం ఇంకా చెల్లించలేదు. ఫీజులు చెల్లించే పని లేనందున ఇన్‌స్టిట్యూట్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని ఉన్నతాధికారులు కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీచేస్తున్నారు.
కార్పొరేషన్‌ ద్వారా కోచింగ్‌ తీసుకుంటున్నవారికి ఫీజు రూ.లక్ష చెల్లిస్తున్నారు. అదే విడిగా అయితే అంతకంటే ఎక్కువ ఉంది. ఒప్పందాలు లేకపోతే దాన్ని మించి అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులకు కూడా కాపు కార్పొరేషన్‌ ప్రత్యేక నిబంధనలు విధించింది. ఫీజులు అభ్యర్థులకే చెల్లిస్తున్నందున వారు ఇన్‌స్టిట్యూట్లకు కట్టకుండా అవి తీసుకుని వెళ్లిపోతే చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఫీజులు, స్టైపెండ్‌ తీసుకుని వెళ్లిపోతే వాటిని తిరిగి చెల్లిస్తామని అండర్‌టేకింగ్‌ తీసుకుంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13611
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author