మళ్లీ పెరగనున్న ఎంపీల జీతాలు

మళ్లీ పెరగనున్న ఎంపీల జీతాలు
December 27 13:31 2017
న్యూఢిల్లీ
వారు పార్లమెంటు సభ్యులు. ప్రజలే ఎన్నుకున్నారు. ప్రజా సమస్యల పై చర్చిస్తారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూస్తారు. అంతే కాదు కీలకాంశాల పై పార్లమెంటులో తమ వాణి వినిపించి తగు చర్యలు తీసుకుంటారు. అలాంటి వారు తమ సంగతి ఏంటని ఆలోచించారు. అందరికీ జీతాలు పెంచుతున్నారు. మన సంగతి ఏంటనే ఆలోచన వచ్చింది. అంతే మాకు జీతాలు పెంచాలని పార్లమెంటు సభ్యులు అడగడంతో కీలక పదవుల్లో ఉన్న వారు ఆలోచనలో పడ్డారు. ప్రజల కోసం శాసనాలు చేసే పార్లమెంటు ప్రతినిధులు ఇప్పుడు జీతాల కోసం కొత్త డిమాండ్ లేవనెత్తుతున్నారు.. ఇప్పటికే ఎంపీలకు లక్ష రూపాయలకు పైగా జీతం ఉంది. అలెవెన్స్ లు బాగానే వస్తాయి. సబ్సిడీలు లేకపోలేదు. రాయితీల రూపేణా జీతం కంటే గీతం ఎక్కువగా వస్తోంది. అయినా సరిపోవడం లేదట. భారీగా ఇతర భత్యాలు, సౌకర్యాలు అనుభవిస్తున్న ఎంపీలు అది తమకేమాత్రం చాలదంటున్నారు. తమ పనికి, హోదాకి తగిన గుర్తింపు ఉండాలంటే జీతం పెంచాల్సిందేనని కోరుతున్నారు. పార్లమెంటు సమావేశాల సమయాన్ని వాకౌట్లు, సస్పెన్షన్లు, బాయ్ కాట్ లతో వృథా చేసే నేతలు వారి జీత భత్యాల పెంపు విషయంలో ఏ మాత్రం మొహమాటపడకుండా అడిగేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఇప్పుడు జీతాల గోలే సాగుతోంది. సమాజ్ వాదీ పార్టీ నేత నరేష్ అగర్వాల్ తొలిగా తమ వాణిని గట్టిగా వినిపించగా… పార్టీల కతీతంగా ఎంపీలంతా మద్దతు పలికారు. మాజీ ఎంపీ, ప్రస్తుత యూపీ సి.ఎం యోగీ ఆదిత్య నాథ్ సారధ్యంలో కమిటీ జీతాల పెంపును సూచిస్తూ ఒక నివేదిక తయారు చేసింది.  ఎంపీల కన్నా వారి సెక్రటరీల జీతమే ఎక్కువగా ఉందనే వాదనుంది. అందుకే తమ సెక్రటరీల కన్నా కనీసం వెయ్యి రూపాయలైనా జీతం ఎక్కువ లేకపోతే బాగుండదనుకుంటున్నారట. ఎంపీల జీతం మీడియా ప్రతినిధుల జీతం కన్నా తక్కువే ఉందని కూడా నరేష్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఈ డిమాండ్ ను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సమర్ధించారు. అందరి జీతాల్లాగా ఎంపీల జీతాలు పెరగాలని కోరారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీని పై స్పందించారు. 2016లోనే ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎంపీలకు ప్రస్తుతం ఇస్తున్న జీతాన్ని రెట్టింపు చేయాలని పి.ఎం.ఓ ఆఫీస్ కే విన్నపాలు అందాయి. గతంలో ఎంపీల జీతాన్ని పెంచాలని రికమెండ్ చేసింది పానెల్. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేయాలంటున్నారు. అంతే కాదు… పార్లమెంటు నియోజక వర్గం నిధులను రెట్టింపు చేయాలని, ఎంపీల పెన్షన్లను కూడా 75 శాతం పెంచాలనీ ఆ పానెల్ కోరింది. ఎంపీల జీతాలు చివరి సారిగా 2010లో పెరిగాయి. అప్పట్లో 16 వేలుగా ఉన్న ఎంపీ జీతాన్ని 50 వేలకు పెంచారు. ఇప్పుడు దీన్ని రెట్టింపు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎంపీల జీతం పెంచాలంటే పార్లమెంటు ప్రతినిధుల చట్టం 1954కు సవరణలు చేయాలి. తమ జీతాల పెంపు విషయంలో మాత్రం అంతా ఐక్యత ప్రదర్శిస్తున్నారు. పార్టీల కతీతంగా ఒక్కటయ్యారు. అంతా అలా కోరితే ఉప రాష్ట్రపతి మాత్రం ఏం చేస్తారు. సరే అనేశారు. అదండీ సంగతి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13655
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author