కోర్టు చివాట్లతో… మార్పు వస్తుందా

కోర్టు చివాట్లతో… మార్పు వస్తుందా
December 29 10:39 2017
(విశ్లేషణ)
నిత్యం రైతు జపం చేసే పాలకులే వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మాట కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకుల బాట కూడా అదే. తాజాగా ఉమ్మడి హైకోర్టు ఈ విషయంలో అక్షింతలు వేయవల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖాతరుచేయటం లేదని హైకోర్టు డివిజన్‌ బెంచి తీవ్రంగా స్పందించింది. భూసేకరణకు సంబంధించి రైతులకు న్యాయమైన పరిహారం చెల్లింపు విషయంలో కోర్టు ఆదేశాల అమలు కోసం కూడా బాధిత రైతులు కాలుకు బలపం కట్టుకుని తిరగవల్సి వస్తున్నది. బాధిత రైతులు దాఖలు చేసిన ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్లు కుప్పలుగా పేరుకుపోతున్నాయని పాలమూరుజిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వాల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణకు ముందే పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. న్యాయస్థానం స్పందన వాస్తవాలకు అద్దం పడుతున్నది.అధికారంలో ఎవరున్నారన్నదానితో నిమిత్తం లేదు. ‘అభివృద్ధి’ యాగంలో సమిధులవుతున్నది మాత్రం రైతుల బతుకులే. దేశాన్నీ, ఉమ్మడి రాష్ట్రాన్నీ సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెసు ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదు. బ్రిటిష్‌కాలంలో రూపొందించిన భూసేకరణ చట్టాన్నే అమలు చేసింది. పరిహారం కోసం అనివార్యంగా రైతులు కోర్టులను ఆశ్రయించవల్సి వచ్చింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం కూడా పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొలువులతో పాటు రైతుల సమస్యలు కూడా ప్రధాన చర్చనీయాంశాలైనాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఉద్యమ నాయకత్వమే అధికారంలోకి వచ్చింది. మూడున్నరేండ్ల పాలన కూడా పూర్తవుతున్నది. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టున్నది. కాంగ్రెసు చెప్పుల్లోనే టీఆర్‌ఎస్‌ పాలకులు కాళ్ళు పెట్టారు. దశాబ్దాల తరబడి దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెసు, ప్రజల ఛీత్కారాలు చవిచూడక తప్పని స్థితి ఎదురైన నేపథ్యంలో… ఓట్ల వేటలో భాగంగానే 2013 భూసేకరణ చట్టం చేసింది. రైతుల ఆందోళనలకు తలొగ్గక తప్పలేదు. అందుకే ప్రజలు కాంగ్రెసును నమ్మలేదు. అనుక్షణం రైతు జపం చేస్తూ అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆచరణలో రైతుల ఆశలు అడియాసలు చేస్తున్నది. ”పాత భూసేకరణ చట్టం కింద కేసుల్లోనే పరిహారం చెల్లించటం లేదంటే, కొత్త చట్టం (2013) కింద దాఖలైన కేసుల్లో రైతులకు ఏ పరిహారం ఇస్తార”ని హైకోర్టు నిలదీసింది. కోర్టు ఆదేశాలంటే ప్రభుత్వాలకు ఆటగా మారిందనీ, జోక్‌గా తీసుకుంటున్నాయనీ, లెక్కలేకుండా పోయిందనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పాలకులకు చురుకంటుతుందా లేదా వేచిచూడాలి.రైతులకు సాగునీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పుకునే పాలకులు, అందుకోసం తమ భూములు త్యాగం చేస్తున్న రైతుల బతుకులు మాత్రం పట్టించుకోవటం లేదు. వీరూ అన్నంపెట్టే రైతులే అన్న విషయం గుర్తించి ఉంటే… సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా వచ్చే ప్రయోజనాలు, ఆ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులు కూడా పొందాలన్న స్పృహ ప్రదర్శించేవారు. మిషన్‌ భగీరథ కోసమైనా, పారిశ్రామిక అభివృద్ధి కోసమైనా, రహదారుల విస్తరణ కోసమైనా ఇదే సూత్రం వర్తింపజేసేవారు. కానీ పాలకుల ఆచరణ ఇందుకు భిన్నంగా ఉన్నది. పూజలందుకోవల్సిన త్యాగధనులను సమిధలుగా ప్రయోగిస్తున్నారు. పాతచట్టం పరిధిలో పరిహారం కోసం ఇచ్చిన కోర్టుల ఆదేశాలనే ఖాతరు చేయని పాలకులకు, 2013 భూసేకరణ చట్టం మాట వినిపిస్తేనే శరీరం మీద తేళ్ళూ, జెర్రులూ పాకుతున్నట్టు ఫీలవుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు బెంచి వ్యక్తం చేసిన అనుమానాలు సహేతుకమైనవే. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణకు అనుసరించిన దొడ్డిదారుల నుంచి స్ఫూర్తి పొందిన తెలంగాణ పాలకుల జీఓ 123 పేరుమీద, జీవో 40 పేరుమీదా రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెసు పాలకుల బాటలోనే ఈ ప్రభుత్వం కూడా రైతులపైన కాల్పులకు తెగబడింది. అడుగడుగునా న్యాయస్థానం ప్రభుత్వం కాళ్ళకు బంధాలు వేయవల్సి వచ్చింది. ఆ జీవోలు చెల్లవనీ, చట్టప్రకారమే రైతులకు న్యాయం చేయాలని చెప్పటంతో పాలకులకు దిమ్మతిరిగింది. ఈ స్థితిలో ప్రధాని మోడీ మరో దొడ్డిదారి రాష్ట్రపాలకుల చెవిలో ఊదారు. 2013 చట్టానికి సవరణలు చేస్తే సహకరిస్తామని అభయమిచ్చారు. ఇంకేం… యుద్ధ ప్రాతిపదిక మీద సవరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిందనిపించుకున్నారు. ఏ సవరణ చేసారో కూడా అధికార పక్షం సభ్యులకే తెలియనంత హడావుడిగా తంతు ముగించారు. రైతుల హక్కులు హరించటంలో అత్యంత వేగంగా పావులు కదిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటికైనా పాలకులు గుణపాఠం నేర్చుకోవాలి. రైతులకు చెల్లించవల్సిన పరిహారం, పునరావాసాల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13890
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author