కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య

కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య
December 30 16:04 2017
 నిజామాబాద్,
కస్తూర్బాగాంధీ విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారనున్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌ చదవలేని వారి కోసం ప్రభుత్వం ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చింది. దీంతో ఈ సంవత్సరం పదో తరగతిచదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే కస్తూర్బావిద్యాలయాల్లోనే చదువుకునే అవకాశం కల్పించనుంది. దీంతో విద్యార్థినుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి.బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు చదువు మధ్యలో మానేయ్యకుండా ఉండడానికి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతీ మండలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత వసతితో విద్యను అందిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు కూడ ఆశించిన విధంగా వస్తున్నాయి. దీంతో పేద విద్యార్థినులు మేలు పొందుతున్నారు. కానీ పదో తరగతి తర్వాత విద్యార్థినులకు హాస్టల్‌ వసతితో కూడిన బోధన ఇంటర్‌ వరకు లేకపోవడంతో చాల మంది విద్యార్థినులు పదో తరగతితోనే చదువు ముగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌ కాలేజీలు ఉన్నా హాస్టల్‌ వసతి లేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మరో కారణమేమిటంటే పదో తరగతి తర్వాత ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఈ మేరకు విద్యావేత్తలు, అధికారులు ఆలోచన చేసి కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రవేశపెడితే డ్రాపౌట్లను తగ్గించవచ్చనే ఆలోచనకు వచ్చారు.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలతో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యకు అనుకూలంగా ఉన్న కేజీబీవీ పాఠశాలల వివరాలు సేకరించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి.  అందులో 2,325 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొత్తగా పెంచికల్‌పేట, చింతలమానెçపల్లి, లింగాపూర్‌లలో 2017 జూలైలో కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 6,7 తరగతుల్లో విద్యాబోధన ఇంగ్లిష్‌ మీడియంలో కొనసాగుతోంది. కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలోని కేజీబీవీలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్బాల్లో 6,7 తరగతుల విద్యార్థులు 325 పోను పాత పాఠశాలల్లో చదువుకునే 2100 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.జిల్లాలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవ సాయం, వ్యవసాయ కూలీపై ఆధారపడి జీవించేవారే. దీంతో అధిక కుటుంబాలు ఇంటర్‌ చదివించే స్థోమత లేక మధ్యలో చదువు మాన్పిస్తున్నారు. ఇంటర్‌ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెడితే విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించడానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. దీంతో డ్రాపౌట్లను కూడా తగ్గించవచ్చని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14138
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author