మగాళ్లతో పోటీ.. 

మగాళ్లతో పోటీ.. 
December 30 18:18 2017
హైదరాబాద్,
హైదరాబాద్, డిసెంబర్ 30,:  భాగ్యనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కుర్రకారు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుతున్నారు. ఖరీదైన కార్లతో వీరు చేసే రాక్షస క్రీడ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. అర్ధరాత్రి వెకిలి చేష్టలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. నగర ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ను ప్రవేశపెట్టారు. నగరంలో పలుప్రాంతాల్లో వీకెండ్‌ శుక్ర, శనివారాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో భాగంగా తనిఖీ నిర్వహించి మద్యం తాగిన వారిపై పోలీసులు కేసులు నమోదుచేయడం మొదలుపెట్టారు. మొదట్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ సత్ఫలితాలనిచ్చింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ ఉన్న రోజుల్లో మద్యం తాగినవారు వాహనాలు నడపటం తగ్గుతూ వచ్చారు. కాని అనూహ్యంగా ఈ ఏడాది మందుబాబులు రికార్డుస్థాయిలో పోలీసులకు చిక్కారు. నవంబరు నెలాఖరుకు సుమారు 19వేల కేసులు నమోదుకావడం పోలీసులను కలవరపరుస్తోంది. గతేడాదితో పోలీస్తే 10 శాతం కేసులు పెరగడంతోపాటు జైలుశిక్షలు పెరిగాయి.
డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసు, ఆ తర్వాత న్యాయస్థానంలో 2,500 రూపాయల చలానా కడితే సరిపోయేది. కాని ఇప్పుడు మోటారు వెహికల్‌ చట్టాన్ని మరింత పట్టిష్టం చేశారు. తనిఖీల్లో బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ (బిఎసి) 100 నమోదవుతే డ్రైవర్‌ను జైలుకే పంపిస్తారు. 100 ఎంఎల్‌గా బ్రీతింగ్‌ ఎనలైజర్‌లో తేలితే రెండు రోజులు అంతకన్నా ఎక్కువ వస్తే నాలుగు, పది రోజుల వరకు జైలుశిక్ష పడుతుంది. ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్లినా తీరు మార్చుకోకపోతే నెల రోజలపాటు జైలుశిక్షతోపాటు అవసరమైతే లైసెన్స్‌ రద్దుచేసేలా చట్టాన్ని రూపొందించారు. గతేడాది సుమారు 7వేల మందికి జైలు శిక్ష పడగా ఈ యేడాది ఇప్పటికే 8,900 మంది జైలుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికి మార్పురాకపోవడంతో రోడ్డు భద్రతా సంస్థలను కలవరపెడుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చట్టాలను అమలుచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ఈ ఏడాది సుమారు 19వేల డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాం తాల్లోనే అత్యధికంగా నమోదైనట్టు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. వీకెండ్‌లో కేవలం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సుమారు 400 కేసులు నమోదవుతాయి. మాదాపూర్‌లో 200, గచ్చిబౌలిలో వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీకెండ్‌ వచ్చిందంటే నగర యువకుల అడుగులు ఇటు వైపు పడుతున్నాయి. పబ్‌ సంస్కృతితోపాటు పేరుగాంచిన బార్‌లు ఉండటంతో హిల్స్‌కు వచ్చేందుకు మెజారిటీ నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. ఇది గ్రహించిన పోలీసులు పబ్‌లు, బార్‌లను కలుపే దారుల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌లను విస్తృతం చేశారు. మందుబాబులు కూడా పోలీసులకు హ్యాండ్‌ ఇచ్చేందుకు తనిఖీలు ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ప్రత్యామ్నాయ దారుల్లో పారిపోతున్నారు. ఈ ఎత్తుగడను గ్రహించిన పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా అప్పటికప్పుడు డ్రంకెన్‌ డ్రైవ్‌ను ప్రకటించి తనిఖీ చేపడుతూ మందుబాబుల ఆటకట్టిస్తున్నారు.
మద్యం మత్తులో యువకులే కాదు మహిళలూ దొరుకుతున్నారు. స్నేహితులతో పబ్‌లో మస్తుగా ఎంజాయ్‌ చేసి సొంతంగా కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీ మొదలుపెట్టాక 2015లో ఇద్దరు, 2016లో తొమ్మిది మంది మహిళా డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఏడాది నవంబర్‌ చివరి వరకు 19మంది మహిళలు మందుకొట్టి పోలీసులకు దొరికారు. వీరిలో సాఫ్ట్‌వేర్‌, వైద్య వృత్తిలో ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.
కేసు నమోదుచేశారనే అక్కసుతో కొంత మంది మహిళలు అనేక సందర్భాల్లో హైడ్రామా సృష్టించారు. పోలీసులపై దుర్భాషలాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. యువతులు అధికంగా మద్యం తాగుతున్నది పబ్‌లలోనే అని ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లలో పబ్‌లు అధికంగా ఉండటంతో వీకెండ్‌ పార్టీల కోసం వచ్చిన పడుచులు పోలీసులకు చిక్కుతున్నారు.
డ్రంకెన్‌ డ్రైవ్‌లో అధికంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు పట్టుబడుతున్నారు. ప్రముఖ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించిన కంపెనీలు, సంస్థలు ఉద్యోగులపై ఆంక్షలు విధించింది. విధుల్లో మాత్రమే ఐడీ కార్డులు, సంస్థ టీషర్టులు ధరించాలని మిగతా సమయంలో వాటిని వాడొద్దని నిబంధనలు పెట్టారు. మాదాపూర్‌కు చెందిన ఐటీ కంపెనీ ఐడీ కార్డులను కేవలం కార్యాలయం వరకే పరిమితం చేసింది. ఒకవేళ డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడినా సంస్థ పేరు పోలీసులకు చెప్పొద్దని హెచ్చరికలు జారీచేసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14214
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author