గొర్రె దారెటు..  

గొర్రె దారెటు..  
January 01 14:11 2018
మహబూబ్‌నగర్‌,
 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం అమలులో లోపాలు.. సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులు ఎంతకాలం తరువాత విక్రయించుకోవచ్చన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో దానిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గొర్రెలను తీసుకున్న కొద్ది రోజులకే విక్రయిస్తున్నారు. ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తగినన్ని గొర్రెల లభ్యత లేకపోవడంతో అధికారులు కూడా వీరి వద్ద కొనుగోలు చేస్తూ.. వాటినే తిరిగి పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది ఇలా రీసైక్లింగ్‌కు దారితీస్తోంది. అయుతే గొర్రెల రీసైక్లింగ్‌ శృతి మించిపోవడంతో పశుసంవర్థకశాఖ దానిని నియంత్రించేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసింది.
ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. అయితే ఇలా స్వాధీనం చేసుకున్న గొర్రెలను ఎక్కడ ఉంచాలి? ఏం చేయాలన్న సమస్య ఎదురవుతోంది? పైగా గొర్రెలను విక్రయించినవారిపై, కొనుగోలు చేసినవారిపై కేసులు కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కేసులు పెట్టినా.. లబ్ధిదారులు గొర్రెలను కచ్చితంగా ఇంతకాలం తరువాతే విక్రయించాలన్న నిబంధన ఏదీ లేకపోవడంతో ఆ కేసులు నిలబడడం లేదు. స్వాధీనం చేసుకున్న గొర్రెలను కొన్ని చోట్ల తిరిగి లబిఽ్ధదారులకు ఇవ్వడం, మరి కొన్నిచోట్ల గోశాలలకు తరలించడం, సొసైటీలకు పంపడం జరుగుతోంది. కానీ, రీ సైక్లింగ్‌ క్రమంలో దొరికిన గొర్రెల నిర్వహణ.. అధికారులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు గొర్రెలను ఎంతకాలం తరువాత విక్రయించాలో స్పష్టమైన నియమ, నిబంధనలు రూపొందించి ప్రభుత్వం ఉత్తర్వులిస్తేనే రీసైక్లింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్‌కు అడ్డుకట్ట వేయడమే కాకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చేయాలంటే గొర్రెలను కనీసం మూడేళ్లపాటు అయినా అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నప్పుడు శాఖ అధికారులు.. రెండు నుంచి మూడు ఏళ్ల వరకూ లబ్ధిదారుడు తప్పనిసరిగా గొర్రెలను అమ్ముకోకూడదని నిబంధన చేర్చాలని ప్రతిపాదించినా అప్పుడు ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే గొర్రెల రీ సైక్లింగ్‌కు వరంగా మారింది. గొర్రె సగటు జీవితం 12 ఏళ్లుగా పరిగణనలోకి తీసుకోవాలని, 8 ఏళ్ల తరువాత గొర్రెకు పండ్లు రాలతాయని, దీంతో అవి పునరుత్పత్తికి పనికిరాకుండా పోవడంతోపాటు క్షీణిస్తాయని పశుసంవర్థక నిపుణులు చెబుతున్నారు.
ప్రతి గొర్రె 8 నెలలకు ఒకసారి పిల్లలను పెడుతుందని, రెండేళ్లలో మూడు ఈతలకు మూడు పిల్లలు వస్తాయని, సబ్సిడీ కింద ఇస్తున్న గొర్రెల యూనిట్లు పొందిన లబ్ధిదారులు రెండేళ్లపాటు వాటిని అమ్మకుండా పోషించుకుంటే మొదటి ఉత్పత్తిగా 60 గొర్రెలు వస్తాయని చెబుతున్నారు. మూడేళ్ల పాటు పోషిస్తే కనీసం వంద గొర్రెల మంద తయారవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. మూడేళ్ల తర్వాత ప్రతి మంద మీద 8 నెలలకు కనీసం 30 గొర్రెలు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. ఈ స్థాయి వచ్చేంతవరకు గొర్రెలను అమ్మకుండా నియమ, నిబంధనలతో ఉత్తర్వులు ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టతకు వచ్చారని, సబ్సిడీ గొర్రెలను రెండేళ్లపాటు అమ్మకుండా నియంత్రించేలా జీవోను తెచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
 ఇదిలా ఉంటే.. కొందరు గొర్రెల లబ్ధిదారులు వాటికి తగినంత మేత లభించని పరిస్థితుల్లోనే అమ్మేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సబ్సిడీ గొర్రెలకు మేత కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాలో 75ుసబ్సిడీపై పశుసంవర్థక శాఖ అధికారులు 56 టన్నుల పశుగ్రాస విత్తనాలు అందజేశారు. వీటి ద్వారా 3700 ఎకరాల్లో మేత అందుబాటులోకి వస్తున్నా, జిల్లాలోని గొర్రెల సంపదకు అది సరిపోదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
 ఇతర రాష్ట్రాల్లో గొర్రెల లభ్యత తగ్గిపోవడంతో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మేరకు సబ్సిడీ గొర్రెల పంపిణీ జరగడంలేదు. రాష్ట్రంలో గొర్రెల పథకం లబ్ధిదారులైన గొల్ల కురుమల సంఖ్య 7.20 లక్షల మందికి చేరుకోవడంతో ఏడాదికి ఒక విడత చొప్పున.. రెండు విడతల్లో లబ్ధిదారులందరికీ గొర్రెల పంపిణీని పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా మార్చి 31 కల్లా 3.62 లక్షల మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఇప్పటికి 1.63 లక్షల మందికి పంపిణీ చేసింది. మార్చి 31 వరకు 2.10 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ వర్గాలు అంటున్నాయి. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత లక్ష్యం 5 లక్షల యూనిట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందంటున్నారు. దీంతో లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలంటే కనీసం4 ఏళ్లు పడుతుందని అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14295
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author