మరింత సమర్ధవంతంగా వైద్య సేవలు

మరింత సమర్ధవంతంగా వైద్య సేవలు
January 02 11:17 2018
 ఆదిలాబాద్,
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు అందించడంలో భేష్ అనిపించుకుంటోంది. ఈ కేంద్రాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ సెంటర్ పరిధిలో ఆరు ఉపకేంద్రాలు వెల్ నెస్ కేంద్రాలుగా.. పీహెచ్సీ తరహాలో వైద్యసదుపాయాలు కల్పించేలా తీర్చిదిద్దుతోంది. వైద్య సేవలు అందించడంలో భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయిలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ కేంద్రానికి వెల్ నెస్ సెంటర్లు ఉంటే ప్రజలకు సమర్ధవంతమైన వైద్యం సకాలంలో అందుతుంది. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీ పరిధిలోని కరంజి-టి, అర్లి-టి, దనోర, భీంపూర్‌, అందర్‌బంద్‌, గిరిగాం ఉపకేంద్రాల్లో సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచడమేకాక వైద్యసిబ్బందిని కూడా పెంచనున్నారు. గర్భిణులు, వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం.. మందులు ఇవ్వడం.. మెరుగైన ఆరోగ్యం కోసం సలహాలు, సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు వెల్‌నెస్‌సెంటర్లుగా మారనున్న ఉపకేంద్రాల్లో కల్పించనున్నారు.
వెల్‌నెస్‌సెంటర్లలో ఆయుర్వేద వైద్యుడితో సహా స్టాఫ్‌నర్సును కూడా నియమించనున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే రోగులకు అక్కడే పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నారు. పరీక్షల కోసం ల్యాబోరేటరీ సౌకర్యం సైతం కల్పించనున్నారు. వచ్చిన రోగులకు వేచి ఉండే గదితోపాటు ఉపకేంద్రంలో ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందించేలా 3 నుంచి 5 పడకలను ఏర్పాటుచేస్తారు. రోగులకు, సిబ్బందికి వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. శస్త్రచికిత్సలకు సంబంధించిన సమస్యలు ఉన్నా అత్యవసర చికిత్సలు అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు మినహా ఇతర రోగాలన్నింటికి ఈ ఉపకేంద్రంలోనే చికిత్సలు అందించనున్నారు. వెల్‌నెస్‌ సెంటర్లుగా మారనున్న ఉపకేంద్రాలకు ఒక్కోదానికి రూ.5లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో కేంద్రంలో మరమ్మతులతోపాటు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. భీంపూర్‌ ఆరోగ్యకేంద్రం పరిధిలో ఆరు ఉపకేంద్రాలు వస్తుండడంతో స్థానికులు హర్షంవ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు సమర్ధవంతమైన వైద్యం అందుతుందని అంటున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14372
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author