ప్రజాసాధికార సర్వే ఆధారంగానే కొత్త కార్డులు!

ప్రజాసాధికార సర్వే ఆధారంగానే కొత్త కార్డులు!
January 02 11:21 2018
తూర్పుగోదావరి,
తూర్పుగోదావరి జిల్లాకు కొత్తగా మంజూరైన 13,536 తెల్ల రేషన్ కార్డులను జనవరి 2 నుంచి11 వరకూ సాగే ‘జన్మభూమి-మాఊరు’ గ్రామసభల్లో పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు 38,791మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతమందిలో 13,536 మంది మాత్రమే అర్హులుగా తేలారు. ప్రజాసాధికార సర్వేతో దరఖాస్తుదారుల వివరాలు అనుసంధానం చేయడంతో అసలైన లబ్ధిదారులను గుర్తించగలిగారు. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులున్నా చాలామంది మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాక అర్హతలేని వారూ అప్లై చేసుకున్నారు. వీటన్నింటినీ ప్రక్షాళించగా 23,677 మంది అనర్హులని తేలింది. గతేడాది జిల్లాలో 1.30 లక్షల వరకు కార్డులు అందజేశారు. తర్వాతఆరు అంచెల విధానాన్ని వీటికి వర్తింపచేశారు. కారు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఎక్కువగా విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్ను చెల్లించే వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారు, భూములు పరిమితికి మించి ఉన్న వారిని తొలగించారు. ఈ విధంగా సుమారుగా 30 వేల తెల్లకార్డులను రద్దు చేశారు.
అప్పట్లో తెల్ల రేషన్ కార్డుల రద్దుపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి అలాంటి సమస్య రాకుండా ముందుగానే ప్రజా సాధికార సర్వే ఆధారంగా దరఖాస్తులను వడపోసి కొత్త కార్డులు సిద్ధం చేశారు. ప్రజాసాధికార సర్వే ఆధారంగా కొత్త కార్డుల జారీని సర్కార్ రెండు విభాగాలుగా విభజించింది. ప్రభుత్వ సూచనల మేరకు లబ్ధిదారులను అత్యంత అర్హులు, అర్హులు అనే రెండు కేటగిరీల్లో చేర్చి జాబితాలను రూపొందించారు అధికారులు. ప్రస్తుతం మంజూరైన 13,536 కార్డుల్లో అత్యంత అర్హులు 2,206 మంది ఉండగా అర్హులు 11,330 మంది ఉన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసే తెల్లకార్డులకు జనవరి నెలకు సంబంధించి చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇస్తారు. ఫిబ్రవరి నుంచి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తారు. ఇదిలాఉంటే జన్మభూమిలోనూ కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిని పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచి అర్హులకు కొత్త కార్డులు జారీ చేస్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14375
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author