రాజకీయ శూన్యత రజనీకాంత్‌కు అనుకూలాంశం

రాజకీయ శూన్యత రజనీకాంత్‌కు అనుకూలాంశం
January 03 11:35 2018
(విశ్లేషణ)
నటుడు రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు.రజనీకాంత్ రాజకీయాలలో నెగ్గుకురాగలరా అనే విషయం ఎట్లా ఉన్నా, ఆయన ప్రవేశించిన సందర్భం మాత్రం అనుకూలంగా ఉన్నది. జయలలిత మరణించడం, కరుణానిధి వృద్ధాప్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరం కావడం వల్ల తమిళనాట రాజకీయ శూన్యం ఏర్పడ్డది. జయలలి త తరువాత అన్నాడీఎంకేలో చెప్పుకోదగిన నాయకుడు ఒక్కరూ లేరు. గత ఏడాది అంతా నాయకుల కుమ్ములాటతోనే గడిచింది. అన్నాడీఎంకేలోని రెం డు పక్షాలు పదవుల కోసం తగవులాడుకోవడం, శశికళ ప్రాబల్యం నుంచి బయటపడి అధికారం కాపాడుకోవడానికి ఒక్కటి కావడం మొదలైన పరిణామాలన్నీ ప్రజలకు రోత కలిగిస్తున్నాయి. జయలలిత మరణం వల్ల ఖాళీ అయిన ఆర్‌కే నగరం నియోజకవర్గం నుంచి దినకరన్ ఎన్నికయినప్పటి కీ, ఈ ఎన్నికల ఫలితాన్ని రాష్ట్రంలో శశికళ పట్ల ఉన్న ఆదరణకు సూచికగా భావించలేము. డీఎంకే పరిస్థితి కూడా గొప్పగా లేదు. గత అసెంబ్లీ ఎన్నిక ల ముందు కరుణానిధి వారసత్వం కోసం ఇరువు రు కుమారుల మధ్య సాగిన కలహం పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టింది. స్టాలిన్ వైపు కరుణానిధి మొగ్గు చూపినప్పటికీ, ఆయకు తండ్రికి ఉన్నటువంటి జనాకర్షణ లేదు. ఏడాదికాలంగా తమిళనాడు రాజకీయం అనేక మలుపులు తిరిగింది. అసెంబ్లీలో బయటా వివిధ సందర్భాలలో ప్రతిపక్ష నేత అయిన స్టాలిన్ పరిణత వైఖరిని ప్రదర్శించలేకపోయారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలలో ఏదో ఒకటి అధికారంలోకి రావడం, అవినీతి పాలన సాగించడం, ప్రజలు విధిలేక రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడం ఎంతో కాలంగా సాగుతున్నది. ఈ రెండింటికి భిన్నంగా విశ్వసనీయమైన మరో రాజకీయపక్షం లేదు. ఈ రాజకీయ శూన్యత రజనీకాంత్‌కు అనుకూలాంశం.  రజనీకాంత్, కమల్‌హసన్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నట్టు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. కమల్‌హసన్ ఒకడుగు ముందుకు వేసినట్టు కనిపించినప్పటికీ, మళ్ళా స్తబ్దుగా మారారు. దీంతో ఇక రజనీకాంత్ ముందడుగు వేస్తారా అనే అంశంపై అందరి దృష్టి నిలిచింది. అన్నా డీఎంకు తిరుగుబాటు అభ్యర్థి, శశికళ బంధువు దినకరన్ ఇటీవల జయలలిత మరణం వల్ల ఖాళీ అయిన ఆర్‌కే నగర్ నియోజకవర్గం నుంచి గెలువడంతో భవిష్యత్ రాజకీయాలు ఎట్లా ఉంటాయనే చర్చ మొదలైంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత- రజనీకాంత్ తన అభిమాన సంఘాలతో ఐదు రోజులపాటు చర్చలు జరిపారు. ఈ చర్చలు ముగిసిన వెంటనే తాను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ఆదివారంనాడు ప్రకటించారు. రెండు ద్రవిడ పార్టీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారనే అభిప్రాయం ఇటీవలి కాలంలో వ్యక్తమవుతున్నది. రాజకీయాలలో కొత్త నీరు చేరాలని ప్రజలు కోరుకుంటున్న దశలో రజనీకాంత్ కొత్త రాజకీయపక్షం స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ ప్రవేశం తక్షణావసరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అవినీతిని అంతమొందించి, నిజాయితీతో కూడిన, పారదర్శక పాలన నెలకొల్పుతానని, అధ్మాత్మిక రాజకీయాలు నెరుపుతానని ఆయన వివరించారు. తాము ఎన్నికైతే మూడేండ్లలో వాగ్దానాలను అమలు చేస్తామని, చేయలేకపోతే వెంటనే రాజీనామా చేస్తామని చెప్పడాన్ని బట్టి ఆయన నిబద్ధత గల రాజకీయాలను ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగించి కేజ్రీవాల్ ఢిల్లీలో విజయవంతం కావడం గమనార్హం. రజనీకాంత్ పార్టీ పేరు, సిద్ధాంతాలను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ రజనీకాంత్ అనుసరించే విధానాలు ఏమిటో ఆయన ప్రకటనలను బట్టి తెలుస్తున్నది. ఆయన అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీ చేస్తానన్నారు. అంటే ఇప్పుడున్న ద్రవిడ పార్టీలను రెండింటినీ ఆయన వ్యతిరేకిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలపై స్పష్టత ఇవ్వడం లేదు. సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది. ముందుగా వచ్చేవి లోక్‌సభ ఎన్నికలే. అయినప్పటికీ హడావుడిగా ఎందుకు పార్టీ పెడుతున్నట్టు అనే సందేహం కలుగుతున్నది. అంటే అన్నాడీఎంకేలో నెలకొన్న అనిశ్చితి, దినకరన్ గెలుపు మూలంగా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా ముందుకు రావచ్చని భావించి ఉంటారు. ఆయన ప్రధాన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే. రజనీకాంత్‌కు, బీజేపీతో సైద్ధాంతిక సారూప్యం ఉన్నది. అందుకే రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించగానే, బీజేపీ నుంచి హర్షం వ్యక్తమైంది. తమిళనాడులో స్వయంగా చొచ్చుకుపోలేని బీజేపీ, తెరవెనుక ఉండి అన్నాడీఎంకే నాయకులను నియంత్రిస్తున్నదనే అభిప్రాయం ఇప్పటికే కలిగింది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ప్రేరణాశక్తి కూడా బీజేపీ అనే అనుమానాలు ఉన్నాయి. తమిళ మూలాలు లేని రజనీకాంత్ ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ ప్రోద్బలంతో రాజకీయాలు నెరుపుతున్నారనే ప్రచారం సాగే అవకాశం ఉన్నది. సినీ నటుడిగా తమిళ ప్రజల ఆదరణ పొందిన రజనీకాంత్, అభిమాన సంఘాలపైనే ఆధారపడకుండా, రాజకీయ పార్టీని పటిష్ఠంగా నిర్మించుకోగలగాలె. నిజాయితీతో, సమర్థవంతమైన పాలన అందిస్తాడనే నమ్మకం కలిగించడం కూడా పెద్ద సవాలు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14524
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author