ఎల్ఈడీ బల్బుల వినియోగంలో వైజాగ్ ఫస్ట్…

ఎల్ఈడీ బల్బుల వినియోగంలో వైజాగ్ ఫస్ట్…
January 03 12:51 2018
విశాఖపట్టణం,
ఏపీలో ఎల్‌ఈడి బల్బుల వెలుగులు ఇక  గ్రామాలకు విస్తరింపచేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 120 సాధారణ వీధిబల్బుల స్థానంలో లెడ్ బల్బులు అమర్చారు.  బల్బుల వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. రాష్ట్రానికి వచ్చేసరికి 24,71,809 ఎండబ్ల్యూహెచ్ (మెగావాట్ అవర్స్), రూ.989 కోట్లు ఆదా అయ్యాయి. పీక్ అవర్ డిమాండ్ 495 మెగావాట్స్‌కు తగ్గింది. లెడ్ బల్బుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్టవ్య్రాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్‌ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నగర వీధులన్నిటినీ ఇప్పటికే లెడ్ బల్బుల వెలుగులతో నింపేయగా పట్టణాల వీధుల్లోనూ పూర్తిగా అమరుస్తున్నారు. ఇక గ్రామవీధులపై దృష్టిపెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 95,600 బల్బులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లో 25 లక్షల సాధారణ వీధిబల్బుల స్థానంలో లెడ్ బల్బులు అమర్చడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వీటిని అమర్చారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు. అన్ని గ్రామాల్లో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. కాగా ఉజాలా (యుజెఎఎల్‌ఏ- ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని రాష్ట్రంలో 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపై 10 రూపాయలకే ఇచ్చారు. ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇచ్చారు. ఇళ్లలో 60వాట్ల బల్బువాడే స్థానంలో వీటిని వాడుతున్నారు. ఇలా ఇళ్లలో వినియోగించే లెడ్ బల్బులను 2016 డిసెంబర్ 31 సాయంత్రానికి దేశంలో 19,01,15,264 పంపిణీ చేయగా, ఏపిలో 1,90,33,333 పంపిణీ చేశారు. అత్యధికంగా 23,77,951 బల్బులు పంపిణీ చేసి తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 18,84,896 బల్బులతో గుంటూరు జిల్లా రెండవ స్థానం, 18,09,230 బల్బులతో కృష్ణా జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. 8,98,518 బల్బులు మాత్రమే పంపిణీ చేసి విజయనగరం జిల్లా చివరి స్థానంలో వుంది.వందశాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల లెడ్ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం మొత్తం అమలైతే 1291 ఎంయు (మిలియన్ యూనిట్స్) విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్‌లో లోడ్‌ను 620 మెగావాట్స్‌కు తగ్గించవచ్చని భావిస్తున్నారు. 60 వాట్స్ సాధారణ బల్బు జీవితకాలం 1200 గంటలైతే, 6-8 వాట్స్ లెడ్‌బల్బు జీవిత కాలం 50వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే లెడ్‌బల్బు జీవితకాలం నాలుగు రెట్లు ఎక్కువ. అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ లెడ్‌బల్బు కాంతినిస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్‌తో ఎక్కువ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లును చాలావరకు తగ్గించుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాల్లో 58వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేశారు. ఒప్పందం ప్రకారం 55.65 యూనిట్ల కంటే 33 శాతం విద్యుత్ అదనంగా ఆదా అయింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 25 లక్షల లెడ్ వీధిలైట్లు అమర్చితే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం వుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14547
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author