చదువులు సరే.. ఫలితలేవి..?

చదువులు సరే.. ఫలితలేవి..?
January 03 16:34 2018
అమరావతి,
పేద కాపు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యోన్నతి పథకం అధోగతి పాలవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు వృథా కావడమే తప్ప, లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. వేలు కాదు… లక్షలు కాదు… కోట్లు పోసి అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఈ పథకంలో భాగంగా అన్ని రకాల పోటీ పరీక్షలు, సివిల్స్‌తో పాటు ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమయ్యే పరీక్షలకు కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో పేద కాపు విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో స్థిరపడతారని ప్రభుత్వం ఆకాంక్షించింది.
2016-17లో 400 మందికి సివిల్స్‌కు శిక్షణ ఇప్పించారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఫీజులు కట్టారు. నెలకు సగటున రూ.9వేలు చొప్పున సుమారు రూ.లక్ష వరకూ స్టయిపెండ్‌ కూడా చెల్లించారు. ఇలా ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రూ.8కోట్లు ఖర్చుచేశారు. తీరా పరీక్షల్లో కేవలం నలుగురు మాత్రమే ప్రిలిమ్స్‌ దాటారు. వీరుకాకుండా మరో 2వేల మందికి ఇదే పథకం కింద ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించడానికి మరో రూ.12.91కోట్లు ఖర్చు చేశారు. వీటిలోనూ పెద్దగా ఫలితాలు రాలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాపు విద్యోన్నతిలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి నాసిరకం ఇన్‌స్టిట్యూట్ల ఎంపికే ప్రధాన కారణంగాతెలుస్తోంది. కార్పొరేషన్‌ కొన్ని ఇన్‌స్టిట్యూట్లను ఎంపిక చేసి వాటిని ఎంప్యానెల్‌ చేసుకుంది. వీటిలో చాలా సంస్థలు కేవలం ప్రభుత్వం నుంచి ఫీజులు పొందడం తప్ప విద్యార్థులకు శిక్షణ ఇవ్వలేదని గతంలోనే తేలింది.
విద్యార్థుల ఇళ్లకు, కాలేజీలకు వెళ్లి హాజరు తీసుకున్న వైనం కూడా వెలుగుచూసింది. కొన్ని సంస్థలకు అర్హత లేకపోయినా ఎంప్యానెల్‌ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. 2017-18లో సివిల్స్‌కు 750 మందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే ఇనిస్టిట్యూట్లను మాత్రం మార్చలేదు. సుమారు 20వేల మందికి ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విదేశీవిద్య పథకం కింద వెయ్యి మందిని విదేశాలకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకూ 817మందికి లబ్ధి చేకూర్చారు. కార్పొరేషన్‌ ద్వారా విదేశాల్లో చదివే పేద కాపు విద్యార్థులకు రూ.10లక్షలు ఇస్తున్నారు. దీంతోపాటు విమానం టికెట్లు, వీసా ఖర్చులు కలిపి మొత్తం రూ.12లక్షలు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. అయితే లబ్ధిపొందిన విద్యార్థులు మాత్రం వారి అనుభవాలు, విజయాలను గురించి వివరించమంటే కనీస స్పందన చూపించడం లేదని అధికారులు వాపోతున్నారు.
భవిష్యత్తులో విదేశీవిద్యకు వెళ్లేవారిని ప్రోత్సహించేలా వారి సక్సెస్‌ స్టోరీలను చూపించాలని కాపు కార్పొరేషన్‌ ప్రయత్నిస్తోంది. కానీ ఎన్నిసార్లు అడిగినా ఒక్క విద్యార్థి కూడా వీరి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. దీంతో విదేశీ విద్య వల్ల కలిగిన ప్రయోజనాలు ఏమిటనేది ప్రభుత్వానికి కూడా తెలియడం లేదు. 2016-17లో కాపు కార్పొరేషన్‌ విద్యోన్నతి ద్వారా సాధించింది ఇదీ అని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14587
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author