పారిశ్రామిక వాడలు, వారధులతో ఆకర్షణీయ అమరావతి

పారిశ్రామిక వాడలు, వారధులతో ఆకర్షణీయ అమరావతి
January 04 13:53 2018
విజయవాడ,
 రాజధాని బాహ్య వలయ రహదారి మార్గంలో రెండు, మూడు ఇండస్ట్రియల్ టౌన్షిప్పుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాలలో, నీటి వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ టౌన్షిప్పులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం వాణిజ్యపరంగా త్వరత్వరగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై 30 రోజులలోపు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు.
 బాహ్య, అంతర్ వలయ రహదారులలో శీఘ్రగతిన అభివృద్ధి ఎలా జరపాలన్న అంశంపై ఇప్పటి నుంచే తగిన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి  సీఆర్డీయే అధికారులకు చెప్పారు. అమరావతి-అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో కూడా పలు జిల్లాల పరిధిలో ఇండస్ట్రియల్ టౌన్షిప్పులను ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతం అభివృద్ధ చెందుతోందంటే సంబంధిత భూముల యజమానులు భూ సమీకరణకు ముందుకు వస్తారని అన్నారు.
3, 4 ఏళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే భూ సమీకరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలోని మొత్తం 30 గ్రామాల మీదుగా సాగే అమరావతి అంతర్ వలయ రహదారిని మొదటి విడతగా 97.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్టు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో తాటికొండ, రావెల తదితర 5 గ్రామాల రైతాంగం భూసమీకరణ విధానంలో తమ భూములను అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ గ్రామాలతో పాటు బాహ్య, అంతర వలయ రహదారుల పరిధిలోని ఇతర గ్రామాలలో కూడా భూ సమీకరణకు ప్రతిపాదనలు తయారుచేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. హైబ్రిడ్ నమూనాలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులను కోరారు.
బాహ్య వలయ రహదారిని మొత్తం 189 కిలోమీటర్ల మేర నిర్మితం కానున్నదని, ఎన్హెచ్ఏఐ దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేసిందని అధికారులు చెప్పారు. మొత్తం రూ.17,761 కోట్ల వ్యయపు అంచనాతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వివరించారు. 150 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారిగా ఇది ఏర్పాటవుతుందని తెలిపారు. దీనికోసం మొత్తం 3,404 హెక్టార్ల మేర భూమి అవసరం పడుతుందని చెప్పారు. రెండు జిల్లాలలో కలిపి మొత్తం 87 గ్రామాలలో ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుకుంటూ బాహ్య వలయ రహదారి ఏర్పాటు కానున్నదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అమరావతి-అనంతపురము ఎక్స్ప్రెస్ రహదారి పూర్తయితే 13 జిల్లాల మధ్య ప్రయాణ భారం తగ్గిపోతుందని, ముఖ్యంగా రాయలసీమ రాజధానికి బాగా దగ్గర అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 200 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రహదారికి సమాంతరంగా రైల్వే లైను కూడా రానుండటంతో దారిపొడవునా వున్న జిల్లాలలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఎక్స్ప్రెస్ రహదారికి భూ సేకరణ నిమిత్తం ఈ బడ్జెట్ తొలి త్రైమాసికంలోనే రూ.2500 కోట్లు కేటాయించాలని అధికారులు ముఖ్యమంత్రిని కోరారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే 393.6 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నిర్మించాల్సిన ఈ రహదారి రాష్ట్రంలో ముఖ్యమైన ఇండస్ట్రియల్ క్యారిడార్ అవుతుందని చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14699
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author