మధ్యాహ్న భోజన పథకం నిధులను సమీక్షించాలి

మధ్యాహ్న భోజన పథకం నిధులను సమీక్షించాలి
January 04 16:12 2018
హైదరాబాద్,
పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా గొప్పదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అభినందించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో రోజు రెండు లక్షల మందికి అక్షయ పాత్ర ద్వారా భోజనం అందుతోందని చెప్పారు. అదేవిధంగా దేశంలో 16 లక్షల మందికి భోజనం అందిస్తున్నారని తెలిపారు. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు అక్షయపాత్ర చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అయితే వీరి సేవలు కేవలం నగరానికి పరిమితం కావడం మంచిది కాదని తానే స్వయంగా వరంగల్ జిల్లాకు ఆహ్వానించానని, దానికి వారు ఒప్పుకుని ఇప్పుడు అక్కడ ఐదు రూపాయల భోజనం అందిస్తున్నారని చెప్పారు.
ఇటీవల పిల్లల ఆహారం, వారి పెరుగుదలపై జరిగిన సర్వేలో తినే ఆహారంలో కావల్సిన స్థాయిలో పోషకాలు ఉండడం లేదని తేలిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తాము చిన్నతనంలో ఇప్పుడు అక్షయపాత్ర ఫౌండేషన్ ఇస్తున్న సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు బాగా తినేవాళ్లమని, వీటితో పాటు పప్పులు కూడా బాగా తినేవాళ్లమని ఉప ముఖ్యమంత్రి కడియం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
 కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 4రూపాయల 13పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థికి 6 రూపాయల 18 పైసలు ఖర్చుచేస్తోందన్నారు. ఇంత తక్కువ డబ్బులతో పోషకాహారం అందించడం సాధ్యం కాదన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు రోజు ఒక గుడ్డును అందించాలని నిర్ణయించి అమలు చేస్తోందన్నారు. అదేవిధంగా దొడ్డుబియ్యం తినలేకపోతున్నారని గమనించి రాష్ట్రమంతా విద్యార్థులకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఇప్పుడు చిరుధాన్యాలు కూడా అందించడం సంతోషకరమన్నారు.
గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అయితే వారానికి మూడు రోజులు గుడ్డు, నెలకు నాలుగు రోజులు చికెన్, రెండు రోజులు మటన్, ఉదయాన్నే పావులీటర్ పాలు, రాగిజావ, బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. వీటితో పాటు రోజు 50 గ్రాముల నెయ్యి కూడా విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి భోజనాన్ని విద్యార్థులకు అందించడం లేదన్నారు. ఇదేవిషయాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించాలని కోరుతామన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని, విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు కృషి చేయాలని విజ్ణప్తి చేస్తామన్నారు.
వచ్చే ఏడాది మధ్యాహ్న భోజన పథకం మరింత మంచిగా అందించేందుకు త్వరలోనే జాతీయ పోషకాహార సంస్థ, ఇక్రిసాట్ సంస్థలతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి పోషకాలతోకూడిన భోజనం విద్యార్థులకు ఇవ్వడంపై చర్చిస్తామన్నారు.
        ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ భర్గివిన్సన్, యునిసెఫ్ ప్రతినిధి ఖ్యాతి తివారి, జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ. లక్ష్మయ్య, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అక్కడున్న విద్యార్థులకు తృణధాన్యాలతో తయారు చేసిన స్వీట్లు, ఆహార పదార్థాలు అందించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14747
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author