నో క్యాష్!

నో క్యాష్!
January 05 17:09 2018
శ్రీకాకుళం,
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నగదు కొరత ప్రజలకు ఇబ్బందిగా మారింది. బ్యాంకులు, ఏటీఎంల్లో తగినంత సొమ్ము లభించక అంతా అల్లాడిపోతున్నారు. అత్యవసర పనులకు సైతం డబ్బులు అందని పరిస్థితి పలువురిది. దీంతో జిల్లా అవసరాలకు తగినంత సొమ్మును అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తిచేస్తున్నారు. శ్రీకాకుళంలో కొన్నిరోజులుగా పెద్దనోట్లు తగ్గిపోయాయి. బ్యాంకులు, ఏటీఎంల్లోనూ ఇదే పరిస్థితి. బ్యాంకులకు వెళ్లి ఎంత పెద్దమొత్తంలో డ్రా చేసుకున్నా రూ.10 లేదా రూ.20నోట్లు ఇస్తున్నారు సిబ్బంది. పెద్ద నోట్లు కావాలని అడిగినవారిలో చాలామందికి మొండిచేయే ఎదురవుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్దనోట్ల కోసం పైరవీలు చేస్తున్నవారూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్న తంతు అంతా పట్టణప్రాంతాల్లో సాగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే నగదు కష్టాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
అసలే నెల ప్రారంభం. ఖర్చులు బోల్డన్ని ఉంటాయి. అద్దె, పేపర్, పాలు, విద్యుత్ లాంటి పలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిరోజుల్లోనే సంక్రాంతి వస్తోంది. షాపింగ్ లు, ఇతరత్రా ఖర్చులు అనేకం ఉంటాయి. ఇలాంటి టైమ్ లో ఏటీఎంలు మూతపడడం, బ్యాంకుల్లో తగినంత డబ్బులేకపోవడం ప్రజల్లో అసహనం పెంచేస్తోంది. సొమ్ము తక్కువగా ఉండడంతో కొన్ని బ్యాంకులైతే కస్టమర్లకు వారు అడిగిన దాంట్లో సగమే ఇస్తున్నారు. అదీ చిన్న నోట్లు ఇస్తున్నారు. దీంతో కస్టమర్లలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి జిల్లా అంతటా తగిన నగదును అందుబాటులో ఉంచాలని అంతా కోరుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు నానాపాట్లు పడాల్సి వస్తుందని అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14887
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author