రైల్వేస్టేషన్లలలో ఎల్ఈడీ వెలుగులు

రైల్వేస్టేషన్లలలో ఎల్ఈడీ వెలుగులు
January 06 12:12 2018
హైద్రాబాద్,
కాంతివంతమైన, విద్యుత్‌ను ఆదా చేసి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎల్‌ఈడీ వెలుగులు దేశవ్యాప్తంగా ప్రతి రైల్వేస్టేషన్‌లో నింపాలని కేంద్రం నిర్ణయించింది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే వీటిని రానున్న మూడు మాసాల్లో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా తొలుత ప్రముఖ పట్టణాల్లో ఉండే రైల్వేస్టేషన్లు, ఆ తరువాత క్యాటిగిరీలోకి వచ్చే మరికొన్ని రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయదలించింది. దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు, హౌరా, గౌహతి, హైదరాబాద్ వంటి ముఖ్యమైన నగరాలకు చెందిన రైల్వే స్టేషన్లలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తారు. తరువాత విశాఖపట్నం, భువనేశ్వర్, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సంబంధితాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధంగా మూడవ దశలో అన్ని రైల్వేస్టేషన్లను ఎల్‌ఈడీ వెలుగులతో నింపాలని కేంద్రం సంకల్పించింది. దేశవ్యాప్తంగా 16 రైల్వేజోన్లు, వీటి పరిధిలో 48 డివిజన్లు ఉండగా, మొత్తంమీద 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కో రైల్వేస్టేషన్‌లో ఎన్ని ఎల్‌ఈడీ దీపాలు అమర్చాల్సి ఉంటుంది? వీటికి ఎన్నాళ్ళపాటు గ్యారంటీ ఇస్తారు? ఏఏ కార్పొరేట్ కంపెనీలు వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి? దీనికి డివిజన్ల వారీగా ప్రత్యేకించి అధికారులు, సిబ్బంది ఎంతమందికి కేటాయించాల్సి ఉంటుంది? అనే పలు అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత రైల్వేస్టేషన్లలో ఎల్‌ఈడీ దీపాలు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే వీటిని వేగవంతం చేయాలని, రానున్న మూడు మాసాల్లో పూర్తిస్థాయిలో స్టేషన్లకు ఎల్‌ఇడి వెలుగులు అందివ్వాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ ఎల్‌ఇడి దీపాలు అమర్చాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్నవాటిని తొలగించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒక్కో రైల్వేస్టేషన్‌లో కనీసం వంద దీపాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని లెక్కలు కట్టి మరీ ఆయా డివిజన్ల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళినట్టు తెలిసింది. విశాఖపట్నం వంటి ఎనిమిది ప్లాట్‌ఫారాలు కలిగి పెద్ద రైల్వేస్టేషన్‌గా పేరున్న ఇక్కడ రైల్వే పోలీసు వ్యవస్థతోపాటు కమర్షియల్, ఆపరేటింగ్, రన్నింగ్ తదితర విభాగాలు నడుస్తున్నాయి. ప్రతి ప్లాట్‌ఫారం మీద, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు పైన ఎల్‌ఈడీ దీపాలను అమర్చాల్సి ఉంటుంది. అలాగే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలోకి వచ్చే వాల్తేరు, ఖుర్దా, సంబల్‌పూర్ డివిజన్లకు సంబంధించి నాలుగైదు పెద్ద రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ విధంగా జోన్లు, డివిజన్ల వారీగా ఉండే రైల్వేస్టేషన్లను క్యాటగిరీల వారీగా నిర్దేశించి తొలుత పెద్దపెద్ద రైల్వేస్టేషన్లకు ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని కేంద్రం సంకల్పించింది. ఇందులోభాగంగా ఇప్పటికే ఆయా జోన్లు, డివిజన్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. కాగా రైల్వేస్టేషన్లకు ఎల్‌ఈడీ దీపాలు అమర్చే కార్యక్రమం విజయవంతమైతే దీని తరువాత రైల్వే పార్కింగ్, రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వేయార్డులు, రైల్వే కార్యాలయాల్లోను వీటిని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14986
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author