హైద్రాబాద్ లో జలమండలి వాటర్ బాటిల్స్

హైద్రాబాద్ లో జలమండలి వాటర్ బాటిల్స్
January 06 13:01 2018
హైద్రాబాద్,
నీటిని విక్రయించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. సురక్షితమైన మంచినీటిని బాటిళ్లు, బబుల్స్, ప్యాకెట్ల రూపంలో అమ్మడానికి కసరత్తు చేస్తోంది. సొంత అవసరాలతో పాటు వాణిజ్యపరమైన అవసరాలకు కూడా నీటిని విక్రయించాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం, బోనాలు, మొహర్రం, రంజాన్, బక్రీద్ తదితర పర్వదినాల సందర్భంగా జలమండలి  కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా బోర్డు దాదాపు 50 లక్షల నీటి ప్యాకెట్లను ప్రైవేట్‌గా కొనుగోలు చేసి  సరఫరా చేస్తోంది. ఇందు కోసం  ఒక్కో ప్యాకెటుకు 75 పైసల చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు బోర్డు చెల్లిస్తోంది. అలాగే  బోర్డు సమావేశాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా కూడా జలమండలి ప్రైవేట్‌గా నీటి క్యాన్లు, సీసాలను కొనుగోలు చేస్తోంది. నగరవాసులకు నీటిని సరఫరా చేసి  వారి దాహార్తిని తీర్చే జలమండలి  ఈ విధంగా బయట నుంచి మంచినీటిని కొనుగోలు చేయడం విడ్డూరం. బయట నుంచి కొనుగోలు చేసే మంచినీటి కోసం బోర్డు  కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో ఆసిఫ్‌నగర్ వద్ద జలమండలి ఆధ్వర్యంలో ఒక నీటి ప్లాంట్‌ను నిర్వహించి, బోర్డు అవసరాలకు నీటిని వినియోగించేది. కొన్ని కారణాలతో ఆ ప్లాంట్ మూత పడటంతో అప్పటి నుంచి ప్రతి అవసరానికి జలమండలి వాటర్ బాటిళ్లను, వాటర్  బబుళ్లను  బయటనుంచి కొనుగోలు చేస్తూ డబ్బును దుబారా చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రైవేట్‌గా నీటిని కొనుగోలు చేయడం జలమండలికి భారంగా మారింది. బోర్డే స్వయంగా మంచినీటిని బాటిళ్లు, బబుళ్లు, ప్యాకెట్ల రూపంలో విక్రయించాలని  బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో టెండర్లను ఆహ్వానించి ఈ మొత్తం  ప్రక్రియను ప్రైవేట్‌కు అప్పగించడానికి బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకియలో భాగంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి  అవసరమైన స్థలం, ముడి నీటిని జలమండలి సరఫరా చేయనుంది. అయితే  జలమండలి అవసరాలకు అవసరమయ్యే నీటిని సదరు గుత్తేదారు సంస్థ ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. బయట విక్రయించే నీటికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు రూ.240 చొప్పున జలమండలికి ఆ సంస్థ చెల్లించాలి. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఆయా యాజమాన్యాలు తమ అవసరాల కోసం  బయట నుంచి కార్పొరేట్ కంపెనీల నుంచి మంచినీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఆయా కంపెనీలు ఒక లీటర్, 250 మిల్లీ మీటర్, 20 లీటర్ల బబుల్స్ సరఫరా చేస్తున్నారు. అలాగే శుభాకార్యాలు, సమావేశాలు, ఫంక్షన్లలో 250 మిల్లీమీటర్ల వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నాయి. అదేవిధంగా   జలమండలి కూడా మూడు రకాలుగా వీటిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రైవేట్ కంపెనీల తరహాలో 250 మిల్లీమీటర్ల బాటిళ్లతో పాటు 20 లీటర్ల బబుల్స్, ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14999
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author