రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉంది

రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉంది
January 10 11:27 2018
అమరావతి
‘జనంలో చైతన్యం,సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు  లక్ష్యంగా’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం రూ.1,22,000 ఉంటే, కడప జిల్లా లింగాల మండలంలో తలసరి ఆదాయం రూ.3,90,000 ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పండ్లతోటల అభివృద్ధితో లింగాల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కన్నా లింగాల తలసరి ఆదాయం 3రెట్లు అధికంగా ఉండటం ఇతర మండలాలకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. కడప జిల్లాలోని రిజర్వాయర్లలో40టిఎంసిల నీటి నిల్వ ఉన్న విషయం గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా ఉద్యానపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతపురం జిల్లా పారిశ్రామిక హబ్ గా రూపొందుతోందన్నారు. రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గరలోనే ఉందంటూ నాలుగు సీమ జిల్లాలలో జరిగిన అభివృద్ధిని సోదాహరణంగా వివరించారు.రాయలసీమతో బాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు వ్యవసాయికంగా అభివృద్ది చెందితే రాష్ట్రంలో వెనుకబాటు అనేదే ఉండదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖరీఫ్ లో లక్ష ఎకరాలలో సాగు విస్తీర్ణం అదనంగా పెరగడం శుభసూచకం అన్నారు. 2.5లక్షల ఎకరాలనుంచి 3.5లక్షల ఎకరాలకు పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విజయనగరం జిల్లాలో కూడా వ్యవసాయం మరింత మెరుగు పడాలన్నారు. ప్రతి రైతు ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షలు సంపాదించే స్థితి రావాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి చంద్రబాబు . ‘‘ సంపద సృష్టించాలి, సమ్మిళిత వృద్దికి వినియోగించాలి,పేదల సంక్షేమానికి వ్యయం చేయాలని’’ దిశానిర్దేశం చేశారు. ‘‘పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణకు తెచ్చి ‘పవిత్ర సంగమం’ చేశాం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.మూడేళ్లలో 30ప్రాజెక్టులు పూర్తిచేయడం ఒక చరిత్ర అంటూ మిగిలిన ప్రాజెక్టులను కూడా ఇదే స్ఫూర్తితో వేగంగా పూర్తిచేస్తామన్నారు.వాస్తవాలను చర్చించేందుకు జన్మభూమి గ్రామసభలను మించిన వేదిక లేదని ముఖ్యమంత్రి అన్నారు. అర్జీలలో అనర్హమైనవి ఉంటే గ్రామసభల్లోనే ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరించాలన్నారు. దీనివల్ల వారిలో ఎటువంటి అసంతృప్తి భవిష్యత్తులో ఉత్పన్నం కాదన్నారు. ఇప్పటివరకు 8,23,715 ఫిర్యాదులు వచ్చాయని,వాటిలో 1,20,635 పరిష్కరించినట్లుగా అధికారులు తెలిపారు. 5,62,890అప్ లోడ్ చేశారని తెలియజేయగా,మిగిలినవి కూడా వేగంగా అప్ లోడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.‘‘ప్రతి గ్రామానికి,వార్డుకు డెవలప్ మెంట్ విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి. ఏం చేస్తే గ్రామం,వార్డు అభివృద్ధి చెందుతాయో గుర్తించాలి,అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.అందుకు 16వేల విద్యార్ధి బృందాల సేవలు వినియోగించుకోవాలి. రాబోయే వేసవికి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. మంచినీటి సౌకర్యం ప్రతి గ్రామంలో,వార్డులో అభివృద్ధి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ప్రతి తల్లికి,బిడ్డకు భవిష్యత్ పై భరోసా కల్పించడమే జన్మభూమి సామూహిక సీమంతాల లక్ష్యంగా పేర్కొన్నారు. మహిళల్లో,చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు అన్న అమృత హస్తం,గిరి గోరుముద్దలు తదితర పథకాలను తెచ్చామన్నారు. పుట్టుకనుంచి చనిపోయేదాకా ప్రతి దశలోనూ సంక్షేమ పథకాలు అమలుచేయడం ద్వారా జీవన భద్రత ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రన్న బీమా ప్రతిష్టాత్మక కార్యక్రమం అంటూ కేవలం రూ.15 ప్రీమియంతో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తున్న పథకం ఇదనేది ప్రజలకు వివరించాలని కోరారు.  ‘‘మన అభివృద్ధి ప్రపంచానికే నమూనా కావాలి,మన సంక్షేమం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి. ఇది స్ఫూర్తిదాయక సమయం, చైతన్యపరిచే కార్యక్రమం,ప్రజల్లో అవగాహన పెంచాలి’’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.మన తెలివి తేటలకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు డిజిటల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నామని,మరోవైపు ఫైబర్ గ్రిడ్ ను అభివృద్ధి చేస్తున్న విషయం ప్రస్తావించారు. ప్రతి ఇంటికి డిజిటల్ లిటరేట్ ఒకరు ఉండాలని గతంలో అన్నానంటూ ప్రస్తుతం అందరూ డిజిటల్ లిటరేట్లు కావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రకృతిని కాపాడుకోవడం,పేదరికం నిర్మూలనలో,సంపద సృష్టించడంలో శాస్త్ర సాంకేతికత దోహదపడుతోందన్నారు.వ్యవసాయంలో,వైద్యంలో టెక్నాలజి వినియోగం పెరిగిందన్నారు. ఇ-ప్రగతి,రియల్ టైం గవర్నెన్స్,పరిష్కార వేదిక 1100, సుపరిపాలనలో టెక్నాలజి వినియోగానికి తార్కాణాలుగా పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా సాయిల్ టెస్టింగ్, ఈ-క్రాప్ బుకింగ్, క్రాప్ కటింగ్ ఎక్స్ పరిమెంట్లు చేస్తున్నాం. పురుగుమందులు చల్లి రైతుల ఆరోగ్యం దెబ్బతినకుండా డ్రోన్ల ద్వారానే చేస్తున్నాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో డ్రోన్ల సహకారం అద్భుతం అంటూ ఇదంతా శాస్త్ర సాంకేతికత వల్లే సాధ్యం అయ్యిందని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.‘‘బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరిగే అవసరం లేదు. బ్యాంకర్లే జన్మభూమి సభలకు వచ్చి రుణమేళా నిర్వహించడం, బ్యాంకు లింకేజిలు ఇవ్వడం ఇదే  తొలిసారి. రేపు నిర్వహించే మెగా రుణమేళా,బ్యాంకు లింకేజి కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జన్మభూమిలో అధికారులు పాల్గొన్నారా అన్న ప్రశ్నకు 93% అవునని, 7% లేదని జవాబిచ్చారు. సమస్యల పట్ల అధికారుల స్పందన బాగుందా అంటే 73% అవునని, 27% లేదని తెలిపారు. సీమంతాలు జరుగుతున్నాయా అని అడిగితే 70% అవునని,30% లేదని అన్నారు.బాలామృతం,అన్న అమృత హస్తంపై అవగాహన కల్పించారా అంటే 64% అవునని తెలిపారు.జన్మభూమిలో సాధికార మిత్రలు పాల్గొన్నారా అంటే 64% అవునన్నారు.డిబేట్ అంశం అర్ధమైందా అంటే 88% అవునని జవాబిచ్చారు.పెన్షన్ అర్హులకే వస్తుందా అంటే 69% అవునన్నారు. రేషన్ కార్డులు అర్హులకు ఇస్తున్నారా అంటే 68% అవునని తెలిపారు. చంద్రన్న బీమా వస్తోందా అంటే 71% అవునని చెప్పారు.ఫిర్యాదుల పరిష్కారం బాగుందా అంటే 50% అవునని,సభలలో జన్మభూమి కమిటీలు పాల్గొన్నాయా అంటే 71% అవునని జవాబిచ్చారు.మొత్తంమీద జన్మభూమి గ్రామాభివృద్దికి దోహదపడుతుందని 90%, ప్రజల్లో మొత్తంమీద సంతృప్తిస్థాయి 94% ఉందని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సంక్షేమం, రియల్ టైం గవర్నెన్స్, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, శాఖల అధికారులు ఎస్ ఎస్ రావత్, అహ్మద్ బాబు, సంజయ్ గుప్తా, చలపతిరావు, రామాంజనేయులు, వివిధ జిల్లాల కలెక్టర్లు,నోడల్ అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15404
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author