ఎవరికీ తీసిపోనివిధంగా గురుకుల విద్యార్థులు

ఎవరికీ తీసిపోనివిధంగా గురుకుల విద్యార్థులు
January 10 18:01 2018
హైదరాబాద్,
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు సొసైటీల నుంచి రెండువేల మంది విద్యార్థులు ఈ లీగ్ లో పాల్గొనడం సంతోషకరమన్నారు. గత మూడేళ్లుగా ఈ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ ను నిర్వహిస్తున్నారని, దీనివల్ల వివిధ సొసైటీలలోని విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేదలకు మంచి విద్య అందించాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలో ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో 546 గురుకులాలు, 475 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారన్నారు. గురుకులాల్లోని విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలల్లో 8000 పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఈ నెలలోపే ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తారన్నారు. ఒక్కో గురుకుల విద్యార్థిపై సాలీన 1,02,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. అందుకే  నేడు ప్రభుత్వ విద్యాలయాలు, గురుకులాల్లో ఉన్న వసతులు, విద్యార్థులతో కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పోటీ పడలేరన్నారు. ప్రభుత్వం కల్పించిన వసతులను వినియోగించుకుని బాగా కష్టపడి గురుకుల విద్యార్థులు వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి స్వాగతం తెలిపేందుకు పెరేడ్ నిర్వహించిన బాలా నగర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు డిప్యూటీ సిఎం ముగ్దులై పదివేల రూపాయల నగదు బహుమతిని అందించారు. అన్ని సొసైటీలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్  వెంకటేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి షఫీ ఉల్లా, బీసీ  సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15487
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author