అయ్యప్ప శరణం అంటున్న సెలబ్రిటీలు

అయ్యప్ప శరణం అంటున్న సెలబ్రిటీలు
January 10 21:01 2018
శబరిమల,
శబరిగిరుల్లో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తులు మాలను ధరించి, భక్తులు 41 రోజులు దీక్షచేస్తారు. నియమనిష్ఠలతో దీక్షపూర్తిచేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరతారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ కొండలు దాటి ఆడవుల గుండా ప్రయాణించి శబరిమలకు చేరుకుంటారు. శివకేశవుల సంగమమైన అయ్యప్పను దర్శనానికి ఏటా కోట్లాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. నల్లటి వస్త్రాలు ధరించి, పాదరక్షలు లేకుండా, పేద, ధనిక తేడాలు వీడి కిలోమీటర్ల మేర నడిచి స్వామి దర్శనానికి వెళుతుంటారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. అందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు సైతం ఉంటారు. బాలీవుడ్ మొదలుకుని దక్షిణాదికి చెందిన పలువురు సినీ తారలూ స్వామి భక్తులే.బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయ్యప్పస్వామికి భక్తుడే. ఇంక్విలాబ్ చిత్ర షూటింగ్లో ఉన్నప్పుడు తొలిసారి అయ్యప్పస్వామి గురించి ఆయన విన్నారట. ఆ తర్వాత కూలీ చిత్రీకరణలో తీవ్రంగా గాయపడ్డ అమితాబ్ త్వరగా కోలుకుంటే స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. కోరుకున్నట్లుగానే తాను కోలుకోగానే శబరిమలలో అయ్యప్పను దర్శించి, మొక్కుతీర్చుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి శబరిమలకు కాలినడకన వెళ్లారు. ఆ తర్వాత చాలా సార్లు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్ప కోసం తాను పూర్తి శాకాహారిగా మారిపోయానని చెబుతారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. దీక్షలో ఉన్నప్పుడు నేలపైనే పవళిస్తానని, ఏళ్లుగా అయ్యప్ప దీక్షను చేపట్టి స్వామివారిని ఏటా దర్శించుకుంటారు.కన్నడకు చెందిన మరో సీనియర్ నటుడు శివరామ్ అయితే ఏకంగా 70 సార్లకు పైగా స్వామివారిని దర్శించుకున్నారట. ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు కూడా అయ్యప్ప భక్తుడే. ఆయన స్వతహాగా క్రైస్తవానికి చెందినా, అయ్యప్పస్వామికి పరమభక్తుడు. ఎంతలా అంటే మాలధరించి, స్వామివారి సన్నిధానంలో కచేరీలు నిర్వహించేంతలా. స్వామివారి పవళింపు సందర్భంగా వినిపించే హరివరాసనం ఏసుదాసు గాత్రం నుంచి వచ్చిందే. అయ్యప్ప గురించి ఆయన ఆలపించిన పాటలు శబరిమల ఆలయ ప్రాంగణంలోనే కాక, స్వామివారి పూజా ప్రదేశాల్లో విరివిగా వినిపిస్తుంటాయి.టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అయ్యప్పస్వామి భక్తులే. ముఖ్యంగా సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ చాలా కాలంగా స్వామి మాలను ధరిస్తున్నారు. ఏటా స్వామిమాలలో ఆయన కనిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీలో కూడా అయ్యప్ప స్వామికి భక్తులు ఎక్కువగానే ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, రాంచరణ్‌లు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తుంటారు. ఓ సినిమా షూటింగ్లో అయ్యప్ప దయవల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానని రాంచరణ్ చెబుతారు. అంతేకాదు స్వామి దీక్ష వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చని అంటారు. ఇప్పటివరకు 10 సార్లకు పైగా ఆయన స్వామివారి దీక్షను చేపట్టారు. మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ సైతం స్వామి దీక్ష తీసుకుని శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్నారు.వీరితోపాటు ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు సైతం అయ్యప్ప స్వామికి భక్తుడే. ఆయన కూడా ఏటా స్వామి మాలను ధరిస్తారు. సీనియర్ నటులు శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ లాంటి వారు అయ్యప్ప దీక్షాపరులే. అంతేకాదు పలు చిత్రాల్లో అదే వేషధారణలో కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. శరత్‌బాబు నటించిన అయ్యప్పస్వామి మహత్మ్యం కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15542
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author