తెలుగు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న సంక్రాంతి శోభ

తెలుగు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న సంక్రాంతి శోభ
January 11 15:40 2018
తూర్పుగోదావరి,
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంరంభం జోరందుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా వేడుక వాతావరణమే కనిపిస్తోంది. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే ఈ పండుగే సంక్రాంతి. తెలుగు నాటే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో ఈ వేడుక సాగుతుంది. ఆనందోత్సాహాలు మోసుకొచ్చే సంక్రాంతిని పంటల పండుగ అనీ, మార్పు తెచ్చే పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి పండుగతోనే ఉత్తరాయణం మొదలవుతుంది. ఆరోజు నుంచి స్వర్గలోకపు ద్వారాలు తెరచి ఉంటాయని పలువురు విశ్వసిస్తారు. సంక్రాంతి వేడుక సాగే మూడు రోజులే కాదు.. అంతకు ముందు నుంచే పండుగ శోభ వెల్లివిరుస్తుంటుంది. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకతో పల్లెలు హరివిల్లులను తలపిస్తాయి. ప్రతీ ఇంటి ముంగిటా పరచుకున్న ముగ్గులతో ఊరంతా మెరిసిపోతుంటుంది. మంచుతెరలు చీల్చుకుంటూ వచ్చే హరిదాసులు.. హరినామ కీర్తనలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతారు. హరి కీర్తనలతో నిదుర లేచిన ప్రజలు హరిదాసులకు తృణమోపణమో సమర్పించి దీవెనలు అందుకుంటారు.
 డూడూ బసవన్నల సందడీ సంక్రాంతిలో ఎక్కువే. పండుగ రోజుల్లో గంగిరెద్దుల హడావుడి ఊరు ఊరంతా వినిపిస్తాయి. సన్నాయి వాయిద్యాలతో  అందంగా ముస్తాబు చేసిన గంగిరెద్దులు నడిచివస్తుంటే సంక్రాంతి పండుగ నట్టింట్లోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ముంగిట ముచ్చట గొలిపే ముగ్గులు, హరిదాసు రామ కీర్తనలు, భగభగలాడే భోగిమంటలు, నోరూరించే పిండివంటలు.. ఇలా సంక్రాంతి లో ప్రతిదీ ఓ గొప్ప అనుభూతే. తెలుగువారికి అతి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ప్రతి పల్లెలోనూ అంబరాన్ని తాకుతాయి. అందుకే సంక్రాంతి అంటే సంబరాల హేల. ఆనందాల డోల. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన వెలుగును లోకానికంతటికీ ప్రసరింపజేస్తూ ఒక రాశిలో నుండి మరో రాశిలోకి సంక్రమణం చేస్తూ జీవులను పోషిస్తున్నాడు. సూర్యుడు ఇలా రాశి మారడం ‘సంక్రాంతి’గా పిలువబడుతోంది. సంక్రాంతి…మానవులకే కాదు ప్రాణకోటి పండుగ. బాధ్యతాయుతంగా జీవించడాన్ని ఈ పర్వదినం నేర్పిస్తుంది. సూర్యుని గమనం వలే మనిషి జీవన గమనంలోని ప్రతి అడుగూ మార్గదర్శకం కావాలి. తాము సుఖ సంతోషాలతో వుంటూ అందరిలోనూ సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా పాటుపడాలి. ఇదే సంక్రాంతి సందేశం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15609
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author