అభయారణ్యం నుంచి తరలించే గ్రామాలకు మెరుగైన పునరావాసం

అభయారణ్యం నుంచి తరలించే గ్రామాలకు మెరుగైన పునరావాసం
January 17 18:45 2018
హైదరాబాద్
పులుల అభయారణ్యం నుంచి తరలించే గ్రామాల వారికి అత్యంత మెరుగైన పునరావాసం కల్పించాలని చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ అటవీ శాఖను ఆదేశించారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల కోర్ ఏరియా నుంచి తరలించే వారిని మానవతా కోణంలో చూడాలని, అడవి నుంచి వారిని బయటికి తీసుకువచ్చే క్రమంలో వారి జీవన ప్రమాణాల్లో కచ్చితమైన, మెరుగైన మార్పు ఉండేలా చూడాలని సీ.ఎస్ అన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి స్వచ్చందగా బయటకు వచ్చేందుకు సుముఖత తెలిపిన రెండు గ్రామాలకు కల్పించాల్సిన పునరావాసంపై సచివాలయంలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పునరావాస అమలు రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ రెండు గ్రామాలకు ఉద్దేశించిన 14.20 కోట్ల విలువైన ప్రతిపాదనలకు పునరావాస అమలు కమిటీ ఆమోదం తెలిపింది. పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్స్ పెక్టర్  జనరల్ (సౌత్) పీ.ఎస్. సోమ శేఖర్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్  రజత్ కుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్,  గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్  క్రిస్టీనా చొంగ్తు,   పీసీసీఎఫ్ పీ.కె.ఝా, పీసీపీఎఫ్ (వైల్డ్ లైఫ్ ) డాక్టర్ మనోరంజన్ భాంజా, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు శరవరణ్, వినోద్ కుమార్, అటవీ శాఖ ఓఎస్డీ ( వైల్డ్ లైఫ్ ) శంకరన్, మంచిర్యాల, నిర్మల్ డీఎఫ్ ఓలు రామలింగం, దామోదర్ రెడ్డి, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్దికీ ఈ సమీక్షకు హాజరయ్యారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో మొత్తం 23 గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేట్  గ్రామాల ప్రజలు పునరావాసం పొందేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణ జాతీయ అథారిటీ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం ఏక మొత్తంగా ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించటం, లేదంటే అదే పది లక్షలతో అటవీ శాఖ ఆధ్వర్యంలో పునరావాసం కల్పించే ప్రతిపాదన ఉంది. ఎవరు ఏ ప్రత్యామ్నాయం కోరుకుంటే అదే అమలు చేసేందుకు నిర్ణయించారు.  మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు వీరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సీ.ఎస్ అధికారులకు సూచించారు. పునరావాసానికి అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో యాభై శాతం భరిస్తాయని పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్స్ పెక్టర్ జనరల్ సోమ శేఖర్ తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్ లో ఎన్ని పులులు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటి, ఇంకా ఏఏ జంతువులు సంచరిస్తున్నాయి, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అనే విషయాలను చీఫ్ సెక్రటరీ , అక్కడి ఫీల్డ్ డైరెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు, కవ్వాల్ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకుని శాశ్వతంగా అక్కడే ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలకు ఇటీవల చిక్కిన పులులు, ఇతర జంతువుల చిత్రాలను చీఫ్ సెక్రటరీ ప్రత్యేకంగా వీక్షించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15846
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author