కొత్తగూడెం సీటుపై కన్నేసిన పవన్

కొత్తగూడెం సీటుపై కన్నేసిన పవన్
January 24 20:35 2018
కొత్తగూడెం,
ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం జనం బాట పట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాత్రి కొత్తగూడెంలో బస చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జనసేనాని రాత్రి మొత్తం కొత్తగూడెంలో బస చేయడం వ్యూహాత్మకమేనని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మెగా అభిమానుల సంఖ్యాబలం ఎక్కువ. 2009లో ప్రజారాజ్యం పార్టీ కొత్తగూడెం నిజయోకవర్గంలో బలంగా పోటీనిచ్చింది.పీఆర్పీ తరఫున పోటీ చేసిన ఎడవల్లి కృష్ణ దాదాపు 39 వేల ఓట్లు రాబట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, నాటి మంత్రి వనమా వెంకటేశ్వర్రావుకు స్వయానా తోడల్లుడు అయిన ఎడవల్లి భారీగా ఓట్లను చీల్చారు. దీంతో 45 వేలకుపైగా ఓట్లతో వనమా రెండో స్థానానికి పరిమితమయ్యారు. తెలుగుదేశం మద్దతుతో సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివరావు 2 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఎన్నికలకు ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లలో ఎవరో ఒకరు మరోసారి ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, పీఆర్పీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధించే వారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక్కడ పవన్‌కు అభిమాన గణం మద్దతు, సామాజికవర్గ అండ ఎక్కువ. పూర్తిస్థాయిలో కొత్తగూడెంపై శ్రద్ధ పెడితే విజయం సాధించే అవకాశాలను కొట్టిపారేయలేం.
ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన తమ ఆశలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన తమ అభ్యర్థిని రంగంలోకి దించితే.. కొత్తగూడెంలో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేన బలంగా ఉండే స్థానాల్లో ఒకటిగా కొత్తగూడెం ఒకటి అయ్యే అవకాశాలే ఎక్కువ. వ్యూహాత్మకంగా వ్యవహరించడం, పవన్ ప్రచారంతో.. పీఆర్పీ కొద్దిలో కోల్పోయిన స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చే ఎన్నికల రూపంలో పవన్ ముందుంది. ఇక్కడ అభ్యర్థిని నిలపడం ద్వారా టీఆర్ఎస్‌తో తామేమీ లాలూచీ పడలేదని కూడా జనసేన చెప్పుకోవచ్చు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16301
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author