వైద్యమో రామచంద్రా.. 

 వైద్యమో రామచంద్రా.. 
January 29 11:22 2018
ఆదిలాబాద్,
పట్టణంలోని నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్‌ పురపాలక సంఘంలో నలుమూలల ఐదు ఆరోగ్య కేంద్రాలున్నా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత వేధిస్తుండటం ప్రజలకు శాపంగా మారింది. దీనికితోడు చిన్నపిల్లలకు మందుల కొరత ఉంది. జిల్లా కేంద్రంలోనే ఉన్నతాధికారులు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఉంటున్నా ఈ కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజలకు వైద్యం అందక నరకయాతన పడుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు పట్టణంలోని నిరుపేదలకు అందించేందుకు పట్టణ ఆరోగ్య కేంద్రాలను 2016 సెప్టెంబర్‌లో ఉన్నతీకరించారు. ఇలా హమాలీవాడ, చిలుకూరిలక్ష్మీనగర్‌, శాంతినగర్‌, పుత్లిబౌలి, ఖుర్షిద్‌నగర్‌ ప్రాంతాల్లోని ఐదు కేంద్రాల్లో సేవలు మెరుగు పర్చేందుకు సరిపడా పోస్టులు మంజూరు చేయించారు. వీటికి జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ కింద నిధులు సమకూరుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక పూర్తికాలపు వైద్యుడు, మరో తాత్కాలిక వైద్యుడు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్‌, కాలనీల్లో పర్యటించేందుకు ఇద్దరు ఏఎన్‌ఎంలు, మందులు ఇచ్చేందుకు ఒక ఫార్మసిస్టు, ఒక గణాంక అధికారి, ఇద్దరు కార్యాలయాల సహాయకులు, ఒక వాచ్‌మెన్‌ పోస్టును కేటాయించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతారు. కానీ ఆ పోస్టుల్లో చాలావరకు ఖాళీలు వెక్కిరిస్తుండడం ఇక్కడ సమస్యగా మారింది.
ఈ కేంద్రాల్లో ఉదయం 8 గంటల ఉంచి రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందించాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పూర్తికాలపు వైద్యుడు పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాలి. నెలకు రూ.33 వేల వేతనం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు చికిత్స అందించేందుకు తాత్కాలిక వైద్యుడిని నియమించాలి. ఈ వైద్యుడికి నెలకు రూ.19వేల వేతనం ఉంటుంది. కానీ ఐదు కేంద్రాల్లో ఎక్కడా తాత్కాలిక వైద్యుడు లేడు. దీనికితోడు శాశ్వత వైద్యులు శాంతినగర్‌, పుత్లిబౌలి కేంద్రాల్లోనే ఉన్నారు. మిగితా హమాలివాడ, చిలుకూరీ లక్ష్మీనగర్‌, ఖుర్షిద్‌నగర్‌ కేంద్రాల్లో వైద్యుల్లేకపోవడంతో వచ్చేరోగుల సంఖ్య తగ్గుతోంది.
ఈ ఐదు కేంద్రాలు పట్టణంలోని మొత్తం జనాభాకు ఉపయోగపడేలా కాలనీలను విభజించారు. ఈ కేంద్రాలన్నీ మురికివాడల్లోనే ఉన్నాయి. ఒక్కో కేంద్రం పరిధిలో పదికి పైగా కాలనీలు ఉన్నాయి. చుట్టుపక్కల కాలనీ ప్రజలు ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. పట్టణశివారులోని కాలనీ ప్రజలు రిమ్స్‌కు వెళ్లాలంటే మూడునాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాలి. శివారుప్రాంతాల్లో నివసించే వారంతా నిరుపేదలు, రోజు కూలీలే ఎక్కువగా ఉండడంతో రిమ్స్‌కు ఆటోలో వెళ్లే ఆర్థిక స్థోమతలేని వారే అధికం. దీంతోనే వారికి అందుబాటులో ఉన్న పట్టణ కేంద్రాలే ఒక వరంలా కనిపిస్తున్నాయి. అవే వారికి పెద్ద ఆసుపత్రిలా మారాయి. కానీ వైద్యమే అందకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు చికిత్స తీసుకునేందుకు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయి. పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు ఇక్కడే వేస్తారు. అత్యవసరమైతే ఆసుపత్రిలోనే రోగిని ఉంచి (ఇన్‌పేషంట్‌ కింద) చికిత్స అందించేందుకు రెండు పడకలను ఏర్పాటు చేశారు. ప్రసవాలు తప్ప అన్ని రకాల చికిత్స ఇక్కడ అందించాలనేది నిబంధన. ప్రస్తుతం కేసీఆర్‌ కిట్టు ప్రయోజనం వంటి ఉపయోగాలు ఈ కేంద్రాల ద్వారా వివరిస్తారు. ఒక్కో కేంద్రం ఆధీనంలో 10 నుంచి 12 మంది వరకు ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరంతా రోజూ ఇంటింటికి వెళ్లి గర్భిణులు, బాలింతలకు చికిత్స పట్ల అవగాహన కల్పిస్తారు. చికిత్సకోసం కేంద్రాలకు పంపిస్తారు. అవసరమైతే వీరిని రిమ్స్‌కు తరలిస్తారు. నిత్యం ఒక్కో కేంద్రానికి 50 నుంచి 100 వరకు రోగులు వస్తారు. కాని వైద్యులు లేక ప్రజలకు శాపంగా మారింది. ఇక గర్భిణులకు రక్తపరీక్ష అత్యవసరం. ప్రతి కేంద్రంలో ల్యాబ్‌టెక్నిషీయన్‌ పోస్టు మంజూరు ఉన్నా కోర్టులో కేసు నడుస్తుండడంతో ఎక్కడా భర్తీకాలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. దీంతో ఆర్థిక భారమైనా రిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
పెద్దలకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నా పిల్లలకొచ్చేసరికి సిరప్‌లు కొరత తీవ్రంగా ఉంది. జ్వరం, వాంతు, విరేచనాలకు చికిత్స కోసం పారాసిటమల్‌, అమాక్సిసిలీన్‌, సీపీఎం మెట్రాజల్‌ వంటి సిరప్‌లు లేవు. అయితే వైద్యుడు లేనిచోట ఈ మందులు సైతం తెప్పించడం లేదు. ఉన్నా ఏమి లాభమని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఐదేళ్లలోపు పిల్లకు చికిత్స అవసరముంటే అధిక మంది అష్టకష్టాలు పడి రిమ్స్‌కు వెళుతున్నారు.
అత్యవసర చికిత్స అందించేందుకోసం ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రానికి రెండు ఆక్సిజన్‌ సిలిండర్‌లు వచ్చాయి. దీనికితోడు ఒక ఈసీజీ యంత్రం పంపించారు. ఒక మైక్రోస్కోప్‌ మిషన్‌, చలికాలంలో పిల్లలకు చికిత్స కోసం ఒక నెబులైజర్‌ను మంజూరుచేశారు. కాని ఈ పరికరాలు వచ్చినా వైద్యుడు లేక నిరుపయోగంగా మారాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16514
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author