పార్టీ దిశగా ఆర్ కృష్ణ‌య్య అడుగులు

పార్టీ దిశగా ఆర్ కృష్ణ‌య్య అడుగులు
January 30 10:48 2018
హైద్రాబాద్,
తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీలు సీజ‌న్ మొద‌లైన‌ట్టుంది..! ఓప‌క్క ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా పావులు క‌దులుపుతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో కీల‌క ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణ‌య్య కూడా మ‌రో పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. నిజానికి, ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌రువాత‌ నుంచి ఆయ‌న టీడీపీలో ఉన్నారో లేరో అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ త‌ర‌ఫున ఆయ‌న మాట్లాడిందీ లేదు, రాష్ట్రంలో పార్టీ నిర్వ‌హించే ఏ కార్య‌క్ర‌మాల‌కూ ఆయ‌న వెళ్ల‌డమూ లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లినా.. స‌భ‌లో మాట్లాడిన దాఖ‌లాలూ లేవు. అయితే, త్వ‌ర‌లో కొత్త పార్టీ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. ఒక టీవీ ఛానెల్ కి వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ… త‌న అనుచ‌రులు, అభిమానులు, త‌మ వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి పార్టీ డిమాండ్ బాగా ఎక్కువ‌గా ఉంద‌న్నారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌వారంతా పార్టీ పెట్ట‌ాలని సూచిస్తున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే చాలా పోరాటాలు చేశారనీ, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్‌, పాఠ‌శాల‌ల ఏర్పాట్లు, స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు వంటివి తెప్పించావ‌ని త‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన‌వారు గుర్తు చేస్తున్నార‌న్నారు. ఇన్ని చేశావు కాబ‌ట్టి, ఇప్పుడు పార్టీ పెట్టు అని త‌న‌పై ఒత్తిడి చేస్తున్నార‌ని కృష్ణ‌య్య చెప్పారు. అన్ని కులాల‌కూ పార్టీలున్నాయ‌నీ, మ‌నకంటూ ఒక పార్టీ ఉండాల‌నీ, మ‌న ఓట్ల‌ను మ‌న పార్టీకే వేసుకోవాల‌నే డిమాండ్ అట్ట‌డుగు గ్రామాల నుంచి కూడా ఈ మ‌ధ్య వినిపిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది త‌మ వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ గా కృష్ణ‌య్య చెప్ప‌డం విశేషం! ఇంత‌కీ పార్టీ పెట్ట‌డం వెన‌క కృష్ణ‌య్య వ్యూహం చాలా సింపుల్‌. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికినా మ‌హా అయితే ఒక సీటు మాత్ర‌మే వ‌స్తుంది. గ‌తంలో ఎల్బీ న‌గ‌ర్ సీటును టీడీపీ ఇచ్చిన‌ట్టుగా! అదే, ఒక పార్టీ పెట్టారే అనుకోండి.. దాన్ని చూపిస్తూ, ఇత‌ర పార్టీలతో పొత్తు అంటూ ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది క‌దా! కృష్ణ‌య్య ఆలోచ‌న ఇదే అని అనిపిస్తోంది. అయితే, పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌నీ, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను మాత్ర‌మే ఇప్పుడు వెల్ల‌డిస్తున్నాన‌ని కృష్ణ‌య్య చెప్ప‌డం మ‌రీ విడ్డూరం! నిజానికి.. రాజ‌కీయ పార్టీలు ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే రోజులా ఇవి! కొంత‌మంది నాయ‌కులు నిర్ణ‌యాల ప్ర‌కార‌మే పార్టీలు పుడ‌తాయి. వారి రాజ‌కీయ ల‌క్ష్యాల‌కు అనుగుణంగానే అవి ఉనికిలోకి వ‌స్తాయి. అంతేగానీ, కృష్ణయ్య చెబుతున్న‌ట్టు అట్ట‌డుగు గ్రామాల్లోంచి కూడా పార్టీ పెట్టాల‌న్న డిమాండ్ వినిపించే ప‌రిస్థితి నిజంగానే ఉందా..!
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16565
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author