ఇసుక అక్రమ రవాణాకు తెరపడేదెన్నడు?

ఇసుక అక్రమ రవాణాకు తెరపడేదెన్నడు?
January 30 19:50 2018
మహబూబ్‌నగర్‌,
 మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు వద్ద ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిపోతోంది. పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిసినా అక్రమార్కులు వెనక్కితగ్గడంలేదు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపిస్తూ ఇసుకను రాత్రిళ్లు.. ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురులు మరింతగా రెచ్చిపోతున్నారు. దండుకోవడమే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. అడ్డాకుల మండలం కందూరు శివారులోని పెద్ద వాగు, మిడ్జిల్‌ మండలం పరిధిలోని దుందుభి వాగు నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. జిల్లాలో ‘పాలమూరు ఇసుక’ పథకంలో భాగంగా ఏడు రీచ్‌లను అధికారులు మొదట గుర్తించారు. మిడ్జిల్‌, కొమ్మిరెడ్డిపల్లి, అంకిళ్ల, సంగంబండ, బిజ్వారం, తిమ్మారెడ్డిపల్లి, అడవి సత్యవార్‌ ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులిచ్చారు.
పాలమూరు ఇసుక పథకానికి ముందు ఇక్కడ అక్రమ రవాణా తీవ్రంగా ఉండేది. అయితే ఈ స్కీమ్ అమలు తర్వాత కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. ఇసుక కావాల్సినవారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇసుక రీచ్‌లను, సరఫరా చేసే ట్రాక్టర్లను జీపీఎస్‌ ద్వారా అనుసంధానం చేసుకోవాలి. డబ్బులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఈ పథకం అమలులోకి వచ్చిన ప్రభుత్వానికి రూ.8.86 కోట్లమేర ఆదాయం వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా అక్రమార్కులు మరో మార్గాలు వెతుక్కుని తమ దందా సాగించేస్తున్నారు. ప్రభుత్వాదానికి భారీగా గండి కొడుతున్నారు. రూల్స్ ప్రకారం రాత్రి సమయాల్లో ఇసుకను తరలించడానికి వీలు లేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుకను రీచ్‌ల నుంచి తరలించాలి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రాత్రి సమయాల్లోనే ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిపోతున్నారు. ఈ తంతును స్థానికులు అడ్డుకున్నా, అడపాదడపా అధికారులు ప్రశ్నించి చర్యలు తీసుకున్నా అక్రమాలకు మాత్రం తెరపడడంలేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంవల్లే ఈ దందా సాగుతోందని అంతా అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం స్పందించి ఇసుకాసురులపై కఠిన చర్యలు తీసుకుని ప్రకృతి సంపదను కాపాడాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16624
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author