పేరుకే రైతు..లాభం మాత్రం వ్యాపారులకు!

పేరుకే రైతు..లాభం మాత్రం వ్యాపారులకు!
January 30 20:16 2018
శ్రీకాకుళం,
రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుని పంట పండించే రైతలకు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు కొందరు మిల్లర్లకు కాసులపంట పండిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించిన వారికి మాత్రం పైసా లాభంలేని పరిస్థితి ఉంటోంది. వ్యాపారులు, దళారుల మాయాజాలంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కర్షకులకు లాభసాటిగా లేకుండాపోతున్నాయన్న కామెంట్స్ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను రైతులు ఇతర వ్యాపారులను అమ్ముకున్నారు. అంతోఇంతో చేతికందిన మొత్తంతోనే సరిపెట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటకు కొంత అధికరేటు వస్తుండడంతో వ్యాపారులు, మిల్లర్లు ఇటువైపు దృష్టి పెట్టారు. రైతుల అవతారమెత్తి తమ వద్ద ఉన్న సరకును అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒడిశా, పశ్చిమ బంగా తదితర రాష్ట్రాల నుంచి కొని…ఇక్కడికి తెచ్చుకుని స్థానిక రైతుల పేర్లతో రాసేసి… దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారని రైతులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
శ్రీకాకుళంలోనే కాక తెలుగురాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇలాంటి తంతే సాగుతోంది. వ్యాపారులు రైతుల గుర్తింపు కార్డులు, ఆధార్ నంబర్లతో కొనుగోలు కేంద్రాల్లో తమ వద్ద భారీగా పోగుబడిన పంటను అమ్ముకుంటూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్న ఉదంతాలు ఇప్పటికే వెలుగుచూశాయి. ఇలాంటి వారంతా రైతులకు తక్కువ చెల్లించి వారి నుంచి పంటను కొన్నారు. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో పంటకు గిట్టుబాటు ధర అధికంగా ఉండడంతో ఆ రేటుకు తమ వద్ద ఉన్న నిల్వలను అమ్ముతున్నారు. ఈ అక్రమాలు తెలిసినా కొనుగోలు కేంద్రాల్లోని కొందరు సిబ్బంది వ్యాపారులకే మద్దతుగా ఉంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వారి నుంచి సరకు కొనుగోలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యాపారులు అమ్ముతున్న పంటను రైతులే విక్రయిస్తున్నట్లు రిజిష్టర్లలో నమోదు చేస్తుండడం మరో అంశం. ఇలాంటి వ్యవహారాలకు ఇప్పటికైనా చెక్ పెట్టి రైతులకు అండగా ఉండాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిష్ఫలం కాకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16632
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author