ప్రతి 10 నిమిషాలకొక సైబర్ నేరం

ప్రతి 10 నిమిషాలకొక సైబర్ నేరం
February 01 11:19 2018
(విశ్లేషణ)
ప్రతి పది నిమిషాలకు ఒక చోట భారతదేశంలో సైబర్ నేరం జరుగుతోందని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్- కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (నిక్- సెర్ట్) నివేదికలో పేర్కొంది. గత మూడేళ్లలో ఈ నేరాలు 300 రెట్లు పెరిగాయని, నిజానికి దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం వరకూ అధికారికంగా నమోదు కావడం లేదని కూడా ఈ నివేదిక పేర్కొంది. నమోదైన 10 శాతం కేసుల్లో 9 శాతం కేసులు పరిష్కారం కావడం లేదు. మొత్తంగా చూస్తే గత ఏడాది 27,482 కేసులు నమోదయ్యాయి. అంటే నమోదు కాని నేరాలు లక్షల్లో ఉంటాయని భావించవచ్చు. దీనికి కారణం ఐటీ చట్టంపై సమగ్ర అవగాహన ఎవరికీ లేకపోవడమే.
ఇంటర్‌నెట్‌కు సంబంధించి వర్చ్యువల్ ప్రపంచమే సైబర్ స్పేస్. దీనికి సంబంధించిన చట్టాలే సైబర్ చట్టాలు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఇ – బిజినెస్, ఇ-గవర్నెన్స్, ఇ- ప్రొక్యూర్‌మెంట్, ఇ-డిపాజిట్లు, ఏటీఎం వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రపంచ అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దుర్వినియోగపరిచే కేసులు ఎక్కువ అవుతున్నాయి.ఏటీఎంలో డబ్బులు తీద్దామని వెళ్తే ఖాతాలో డబ్బులు లేవని తెలిసి గొల్లుమనేవారు, ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేసిన మరుక్షణం ఖాతాలో డబ్బులు అన్నీ అదృశ్యవ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయని తెలిసి గగ్గోలు పెట్టేవారు, రాత్రీపగలు అని లేకుండా సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికర సందేశాలు పంపేవారు మరికొందరు. ఇలా రోజురోజుకూ సరికొత్త వేధింపులు ఎక్కువవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు దరిమిలా భారత్ అతి పెద్ద డిజిటల్ దేశంగా మారిపోతున్న క్రమంలో సైబర్ తీవ్రవాదం దేశానికి పెనుముప్పుగా మారుతోంది. సైబర్ తీవ్రవాదానికి సరిహద్దులు లేవు, ప్రపంచంలో ఏదో ఒక మారుమూల కూర్చుని మరో దేశంలోని కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసే సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. ఇంతకాలం భారత్‌కు ఈ ముప్పు పెద్దగా లేకున్నా రోజురోజుకూ అది విస్తృతమవుతోంది.ఏటా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు 27 లక్షల కోట్ల రూపాయిలను కొల్లగొడుతున్నారని ‘మెకాఫే’ అంచనా వేసింది. అయితే ఈ లెక్కలను మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించడం లేదు, అమెరికాలో గత ఏడాది బ్యాంకింగ్ కార్డులకు సంబంధించి 1500 కోట్ల రూపాయిల మేర మోసాలు జరిగాయని మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. జునిఫెర్ రీసెర్చి సంస్థ లెక్కల ప్రకారం 2019 నాటికి సైబర్ మోసాల నష్టం రెండున్నర లక్షల కోట్లు ఉంటుందని అంచనా. క్షేత్రస్థాయిలో జరిగే యుద్ధాల కంటే తీవ్రమైన సమాచార విధ్వంస యుద్ధాలు మున్ముందు జరగనున్నాయని ఇప్పటికే నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ తీవ్రవాదుల ‘యుద్ధాలకు’ కంప్యూటరే ఒక పెద్ద పనిముట్టు, ఇంటర్‌నెట్ మరో మారణాయుధం. వీటిని ఉపయోగించి దేశాలనే కొల్లగొట్టే ముప్పు మున్ముందు ఉండనుంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అంతా సన్నద్ధమవుతోంది.క్రెడిట్ కార్డులు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్సు తదితరాలకు సంబంధించిన మోసాలతో పాటు హ్యాకింగ్, ఫిషింగ్, వైరస్, సైట్లలోకి చొచ్చుకుపోవడం, డేటా చౌర్యం, సర్వీసు అటాక్స్, ట్యాంపరింగ్, ర్యాన్‌సమ్ వేర్ పంపడం, డేటా అనధికారికంగా వాడటం, బ్యాంకింగ్ కార్డుల ఫోర్జరీ, మొబైల్‌సిమ్ క్లోనింగ్ , ఐఎంఇఐ నెంబర్‌ను మార్చడం, సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మెయిలింగ్, అశ్లీల సినిమాలు, మార్ఫింగ్, న్యూడ్, ఇతర అనైతిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి. ఒక్క భారత్‌లోని పరిస్థితి చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2011లో ఐటీ చట్టం కింద 1791 కేసులు నమోదుకాగా, 2012లో అవి 2876కు పెరిగాయి. గత మూడేళ్లలో 1.71 లక్షల కేసులు నమోదయ్యాయి. 2018 జనవరి నెలలో ఇంత వరకూ 5వేల కేసులు నమోదయ్యాయి. ఇతరుల యూజర్‌నేమ్, పాస్‌వర్డులను దొంగిలించడం, సైబర్ సేవలు అందించడానికి నిరాకరించడం కూడా ఐటి చట్టం కింద నేరంగానే గుర్తించారు. డిసెంబర్ 21 వరకూ 25,800 సైబర్ మోసాలపై కేసులు నమోదైనట్టు కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతవారం చెప్పారు. ఈ కేసులకు సంబంధించి సుమారు 179 కోట్ల రూపాయిల మేర మోసం జరిగినట్టు ఆయన వెల్లడించారంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది. ఇవన్నీ డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన మోసాలు. కేవలం డిసెంబర్ నెలలోనే 10,220 కేసులు నమోదయ్యాయి. వీటి విలువ సుమారు 111.85 కోట్లు. ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో హర్యానా, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. గత ఏడాది జరిగిన అతి పెద్ద మోసాల్లో ఒకటి సోషల్ ట్రేడ్ మోసం. 3700 కోట్ల రూపాయిలకు కుచ్చుటోపీ పెట్టారు. ఏడులక్షల మంది ప్రజలను మోసం చేసిన ఈ స్కామ్‌కు సంబంధించి కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ తతంగంపై దృష్టి పెట్టిన భారత్ ఐటి చట్టాన్ని 2000 సంవత్సరంలో రూపొందించింది. 2008లో దీనికి కొన్ని సవరణలు కూడా చేశారు. 2009 ఫిబ్రవరి 5న చట్టానికి రాష్టప్రతి ఆమోద ముద్ర వేశారు. 2009 అక్టోబర్ 27 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. 2016లో బిల్లు 3 ద్వారా మరో సవరణ తీసుకువచ్చారు. ఇనస్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలనే నిబంధనను సవరించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని మార్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ (సిసిఎ) ఆధ్వర్యంలో సైబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ పనిచేస్తున్నాయి. 1908 పౌరపరిపాలనా చట్టం మాదిరిగానే సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలను ఈ ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని ఐటీ చెబుతోంది. ప్రతి ప్రధాన పోలీసు స్టేషన్‌కు అనుబంధంగా సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు డాటా రక్షణ, భద్రత చట్టం -2017 పూర్తి స్థాయిలో త్వరలో అమలులోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఐటీ రూల్స్ -2011(ఎస్‌పిడిఐ రూల్స్)కు ఇది విస్తృత పరిధిని ఏర్పాటు చేయబోతోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలను సమన్వయ దృష్టితో విశే్లషణ చేసి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి), నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటక్షన్ సెంటర్ (ఎన్‌సిఐఐపి), డాటా ప్రైవసీ అండ్ ప్రొటక్షన్ సెంటర్ లను ఏర్పాటు చేయబోతోంది. న్యాయపరంగా, విధానపరంగా, వ్యవస్థీకృతపరంగా గట్టి చట్టాలను రూపొందించి అమలులోకి తెచ్చేందుకు సైబర్ నేరాల నియంత్రణలో దిట్టగా ఉన్న 15 దేశాలతో భారత్ సమాచారాన్ని పంచుకుంటోంది. అన్ని విభాగాల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారులను నియమిస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16681
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author