భక్తజన కోటితో కన్నుల పండవగా మేడారం జాతర

భక్తజన కోటితో కన్నుల పండవగా మేడారం జాతర
February 01 22:24 2018
మేడారం,
మేడారం భక్తజన సంద్రమైంది. భక్తిపారవశ్యంతో తల్లులను దర్శించుకునే జాతర జనజాతరగా మారింది. ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కల్పించే వసతులు వారికి అందేలా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ నిత్యం జనాల్లో ఉంటూ జాతరను పర్యవేక్షిస్తున్నారు. మేడారంలో ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డి మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.
మేడారంలో  ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని, వచ్చే మూడు రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు రానున్నారని వీరందరికి తగిన వసతులు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. భక్తులు చాలా గొప్పగా సహకరిస్తున్నారని, వీరికి కోటి వందనాలు తెలిపారు. అధికారులు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వారి సేవలను అందిస్తున్నారని, అయితే లక్షల్లో భక్తులు వస్తుండడంతో అందరినీ వారి చేరలేకపోతున్నారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా తాను, మంత్రిగా ఐకె రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ జనాల్లోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే అధికారులకు చెప్పి పరిష్కరిస్తున్నామన్నారు. నిన్నటి వరకు నల్లాలలో తాగునీటి సమస్య వచ్చిందని, నేడు ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు. చిలకల గుట్ట వద్ద ట్యాపుల్లో నిరంతర నీరు రావడం, ఎక్కువగా ట్యాపులు ఉండడం వల్ల బురదమయం అవుతుందని భక్తులు చెప్పడంతో…నేడు అక్కడ నీటి సరఫరాను నియంత్రించామన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామన్నారు.
నేడు గద్దెల మీదకు సమ్మక్క రానుందని, దీంతో భక్తులు మరింత ఎక్కువ వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకే ఇక్కడే ఉండి జనాల్లోకి వెళ్తూ అక్కడ ఉన్న చిన్న, చిన్న లోటుపాట్లను వెంటనే దగ్గరుండి పరిష్కరిస్తున్నామన్నారు.
ప్రధానంగా జాతరలో తప్పిపోతున్న వారి సమస్య ఎక్కువగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు . కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలనికోరారు. తప్పిపోయిన వారు కూడా పోలీసుల సంరక్షణలో జాగ్రత్తగా ఉన్నారని, కుటుంబ సభ్యులకు వారిని అప్పగిస్తున్నామని చెప్పారు.
చత్తీస్ ఘడ్ సిఎం రమణ్ సింగ్ సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు వస్తున్నట్లు రెండు రోజుల ముందే సమాచారం అందిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామని, అయితే సిఎం రమణ్ సింగ్ అత్యంత రిస్క్ ఉన్న ముఖ్యమంత్రి కావడంతో ఆయన దగ్గర ఉన్న ఎన్.ఎస్.జీ కమెండోలు ఇక్కడున్న పోలీసులను సంప్రదించకుండా , వారు చెప్పింది వినకుండా నేరుగా సిఎం రమణ్ సింగ్ ను తల్లుల వద్దకు తీసుకెళ్లారన్నారు. అయితే భక్తులు లక్షల సంఖ్యలో ఉండడంతో కొబ్బరికాయలు, బంగారు వేయడం సిఎం కు ఇబ్బంది కలిగించిందన్నారు. సిఎం వస్తున్నారని తెలిసి, వారిచ్చిన ప్లాన్ ప్రకారమే తాము ఏర్పాట్లు చేసినా…వారిచ్చిన ప్లాన్ ను వారే పట్టించుకోకపోవడం వల్ల భక్తులను క్లియర్ చేయలేకపోవడంతో ఆయన సారలమ్మ గద్దె వద్దకు వెళ్లకుండానే వెనుదిరిగారని చెప్పారు. అనంతరం మేం ఆయనను మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని, సన్మానం చేశామన్నారు. సిఎం రమణ్ సింగ్ గారు సంతృప్తి వ్యక్తం చేశారని, భక్తులు అధికంగా ఉండడం వల్లే తాము అలా వెనుదిరిగామని చెప్పినట్లు తెలిపారు.
అయితే ఈ వాస్తవాలన్నీ తెలుసుకోకుండా బిజెపి నేతలు ప్రభుత్వంపై నిందలు వేసి రాజకీయం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం మండిపడ్డారు. బిజెపి నేతలకు నిజంగా చావ ఉంటే సమ్మక్క-సారక్కలపై గౌరవం, భక్తి ఉంటే ఈ జాతరను జాతీయ పండగగా ప్రకటింపచేయాలని సవాల్ విసిరారు. లేకపోతే ఇలాంటి చవకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. లక్షల మంది భక్తులు వచ్చే చోట వారి అవసరాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. సిఎం కేసిఆర్ గత ఏడాది 160కోట్ల రూపాయలు, ఈ ఏడాది 80 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 240 కోట్ల రూపాయలు కేటాయించారని, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వసతులు కల్పిస్తుంటే..సిఎం డౌన్, డౌన్ అనడం బాధాకరమన్నారు. బిజెపి నేతలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవహరించాలన్నారు.
ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం 11 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తున్నారని, మధ్యాహ్నం 1.15 నిమిషాలకు సిఎం కేసిఆర్ వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమైన నేతలు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉంటాయని, భక్తులు సహకరించాలని కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తున్నందుకు మూడు మిలటరీ హెలికాప్టర్లు వస్తాయని, వీటి కోసం హెలిపాడ్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వివిఐపీలు వస్తున్నందున భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా 24 గంటలు గద్దెలు తెరిచే ఉంచుతామన్నారు.
మొత్తానికి లక్షల మంది భక్తులు వస్తున్నా…ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారని, దీనికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి భక్తుల సహకారం, తల్లుల ఆశీర్వాదం ఉండడం వల్లే జాతర బాగా కొనసాగుతుందన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16747
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author