ప్రతిభావంతుడికి సాయిధరమ్‌ తేజ్‌ సాయం 

ప్రతిభావంతుడికి సాయిధరమ్‌ తేజ్‌ సాయం 
February 01 22:52 2018
 హైదరాబాద్
సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్‌ యాదవ్‌ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్‌ నరేష్‌ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు. గురువారం నరేశ్‌ యాదవ్‌కు లక్ష రూపాయిల చెక్కును స్వయంగా అందజేశారు. అనంతరం నరేష్‌ గురించిన వివరాలు, వాలీబాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించాలని కోరుతూ నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నరేష్‌ యాదవ్‌ సాధించిన విజయాలు:
చిన్నప్పుడే నరేష్‌ ఎడమ కాలికి పోలియో సోకింది. వైకల్యాన్ని అధిగమించి ఎంతో పట్టుదలతో పారా అథ్లెట్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒకవైపు ఎంటెక్‌ చదువుతూనే పారా బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ మూడింటిలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో కాంస్య పతకం, శ్రీలంకతో జరిగిన పారా వాలీబాల్‌ టోర్నీలో స్వర్ణం, 2015 నేషనల్‌ సిట్టింగ్‌, స్టాండింగ్‌ వాలీబాల్‌ టోర్నీల్లో కాంస్య పతకాలు, జాతీయ అథ్లెటిక్స్‌ షాట్‌పుట్‌లో రజతంతో సత్తా చాటాడు. ఇప్పుడు భారత్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ మధ్య జరగనున్న సిట్టింగ్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీ బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి ఎంపికైన సభ్యులు.. బ్యాంకాక్‌ ప్రయాణంతో పాటు వీసా, లైసెన్స్‌, ఎంట్రీ ఫీజు, ఏడు రోజులకు గాను భోజన, వసతి, స్పోర్ట్స్‌ కిట్‌, కోచింగ్‌ ఫీజులను ఎవరికి వారే భరించాలని భారత పారా ఒలింపిక్‌ వాలీబాల్‌ సమాఖ్య తెలిపింది. ఇందుకుగాను దాదాపు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. ఆ మొత్తం ఫిబ్రవరి 15వ తేదీలోపు చెల్లిస్తేనే నరేష్‌ ఈ టోర్నీలో పాల్గొంటాడు. పేద కుటుంబానికి చెందిన తాను ఇంత మొత్తం భరించలేని స్థితిలో ఉన్నానని నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సాయం చేయాలని శాట్స్‌కు అర్జీ పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర క్రీడా పాలసీలో పారా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన వారికే తప్ప మిగతా పారా అథ్లెట్లకు సహాయం చేసే జీవో లేదని అధికారులు చెబుతున్నారని నరేష్‌ చెప్పాడు. దాంతో అంతర్జాతీయ టోర్నీలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చినా.. డబ్బు లేక దాన్ని కోల్పోయేలా ఉన్నానని వాపోతున్నాడు. క్రీడా అధికారులతో పాటు దాతలు ఎవరైనా సాయం చేస్తే బ్యాంకాక్‌ వెళ్లి టోర్నీలో సత్తా చాటుతానని నరేష్‌ చెబుతున్నాడు. తనకు సాయం చేయాలనుకునే వారు 96665 93696, 97002 85868 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16765
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author