విదేశాల్లో శాఖలు తెరిచేందుకు 100 వర్శిటీలు రెడీ

విదేశాల్లో శాఖలు తెరిచేందుకు 100 వర్శిటీలు రెడీ
February 02 12:35 2018
హైద్రాబాద్,
అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాలకు ‘ప్రపంచస్థాయి హోదా’ ట్యాగ్ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇటువంటి ట్యాగ్ దక్కితే వాటికి యూజీసీ నిధులు పెరగడమేగాక, ప్రపంచంలో ఏ దేశం నుండైనా విద్యార్థులను ఆహ్వానించేందుకు, విదేశీ వ్యవహారాల విభాగాలను తెరిచేందుకు వీలు కలుగుతుంది. మరో పక్క ఆయా విశ్వవిద్యాలయాలు విదేశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను ఆహ్వానించేందుకు సైతం అవకాశం దక్కుతుంది. వందేళ్లు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయాలతో పాటు మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, సాపేక్షంగా బోధనేతర సిబ్బంది, విద్యార్ధులకు వసతి, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న విద్యాసంస్థలను ఈ కేటగిరికి ఎంపిక చేస్తారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ ప్రయత్నం ప్రారంభించగానే దేశంలో 100 విశ్వవిద్యాలయాలు ఈ హోదా కోసం పోటీ పడుతున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ అర్హతలను కలిగినప్పటికీ అవి మార్కెటింగ్ చేసుకోలేకపోవడం, సంప్రదాయ నియమనిబంధనల చట్రంలో ఉండిపోవడంతో ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారలేక, విద్యార్థులను ఆకర్షించలేక, కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి.
యూరప్ తదితర ప్రాంతాల్లో కేవలం సంస్థలు ఏర్పడిన ఐదారేళ్లకే అవి విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వర్శిటీలు అనుసరిస్తున్న విధానాలపై గత ఐదేళ్లుగా లోతైన అధ్యయనం చేస్తున్న మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలో 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు యూనివర్శిటీలకు ఇప్పటికే స్వేచ్ఛను, పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. ప్రపంచంలో వంద యూనివర్శిటీల జాబితాలో అవి చోటు సంపాదించుకునేందుకు అవసరమైన విద్యాత్మక చర్యలను కూడా తీసుకుంది. ఇంకో పక్క అగ్రగామి వర్శిటీల జాబితా కోసం దరఖాస్తులను స్వీకరించగా, 100 దరఖాస్తులు హెచ్‌ఆర్‌డికి వచ్చాయి. అందులో 10 సెంట్రల్ యూనివర్శిటీలు, 25 రాష్ట్రాల ఆధీనంలోని ప్రభుత్వ యూనివర్శిటీలు, 20 జాతీయ స్థాయి ప్రాముఖ్యత ఉన్న విద్యాసంస్థలు, మరో ఆరు డీమ్డ్ వర్శిటీలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 9 వర్శిటీలు, 16 డీమ్డ్ వర్శిటీలు బ్రౌన్‌ఫీల్డు కేటగిరి కింద దరఖాస్తు చేయగా, 8 ప్రైవేటు విద్యాసంస్థలు గ్రీన్‌ఫీల్డు కేటగిరి కింద దరఖాస్తు చేశాయి.ఇటువంటి హోదాను కల్పించడం వల్ల విశ్వవిద్యాలయాల మధ్య గట్టి పోటీ ఏర్పడి వౌలిక సదుపాయాలు పెరగడమేగాక, వ్యవస్థీకృత యంత్రాంగం కూడా పెరుగుతుందని కేంద్రం యోచిస్తోంది. దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయాల మధ్య గట్టి పోటీని సృష్టించి అవి సాధించిన విజయాలు, ప్రాధమిక గణాంకాలు, పరిశోధన పత్రాలు, బోధన సిబ్బంది పెంపొందించుకున్న ప్రపంచస్థాయి ఖ్యాతి, పేటెంట్‌లు, విద్యార్థుల ప్రతిభాపాటవాలు పరిశీలించేందుకు అధీకృత కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ పరిమితులను రూపొందించి వివిధ విశ్వవిద్యాలయాల మధ్య ఉన్న పోటీని గమనించి వాటి ప్రగతి ఆధారంగా పాయింట్లను కేటాయించి తుది జాబితాను తయారుచేస్తుంది. అలా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛను ప్రసాదిస్తారు. 30 శాతం మేర విదేశీ విద్యార్ధులను చేర్చుకునేందుకు, అలాగే 25 శాతం మేర ఫ్యాకల్టీని నియమించుకునేందుకు , 20 శాతం మేర ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్ చేసేందుకు స్వేచ్ఛ దక్కుతుంది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలు దరఖాస్తు చేయగా, అదే బాటలో ఉస్మానియా యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీతో పాటు ప్రైవేటు వర్శిటీ ఇక్ఫాయి, డీమ్డ్ వర్శిటీ ‘గీతం’ ఉన్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16786
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author