మల్లెలు..మూర రూ. 30

మల్లెలు..మూర రూ. 30
February 05 12:05 2018
 గుంటూరు,
సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు పెరిగిన ధరలతో వినియోగదారుల ముక్కుపుటాలను అ‘ధర’గొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వాటి ధర పెరగడంతో కొనడానికి వినియోగదారులు జంకుతున్నారు. పూల కొట్ల వద్ద మూర మల్లెపూలను రూ.30 నుంచి రూ.35కి, పూల మార్కెట్‌లో కిలో రూ.1000కి అమ్ముతున్నారు. గతంలో మూర రూ.10 నుంచి రూ.20లోపు, కిలో రూ.500 వరకూ ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం కొంచెం డిమాండ్‌ ఉండేది. ప్రస్తుతం అవేమీ లేకపోయినా మల్లెపూల ధరలు షాక్‌ కొడుతున్నాయి. మల్లెపూలు ఎక్కువగా సాగయ్యే రాజధానిలో ప్రభుత్వ భూసమీకరణ వల్ల సాగు తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో డిమాండ్‌తోపాటు పూలకు రేటూ పెరిగింది.రాష్ట్రంలో 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో మల్లె సాగు జరిగేది. ప్రస్తుతం 7 వేల ఎకరాలకే పరిమితమైంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, బేతపూడి మల్లె సాగుకు పెట్టింది పేరు. గతంలో ఈ మూడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం అది 700 ఎకరాలకు పడిపోయింది. నిడమర్రులోనే గతంలో 1500 ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా సాగు లేకుండాపోయింది. రాజధానికి భూములు తీసుకోవడంతో మల్లె తోటల స్థానంలో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో ఎకరానికి వెయ్యి క్వింటాలు మల్లెపూల దిగుబడి వచ్చేదని, కానీ ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు.గతంలో తోటల్లో రైతులు కిలో మల్లె పూలను రూ.200కి వ్యాపారులకు అమ్మేవారు. వ్యాపారులు పూల కొట్లకు రూ.300 నుంచి రూ.400కి విక్రయించేవారు. మూర ధర రూ.10, రూ.15 ఉండేది. కానీ తోటలు తగ్గిపోవడంతో డిమాండ్‌ పెరిగిపోయింది. గతంలో విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ఇక్కడి నుంచే పూలు పంపేవారు. ప్రస్తుతం విజయవాడకే పూలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వడ్లపూడి, చీరాల, మైలవరం, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో మల్లె సాగు జరుగుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని పరిధిలో మూడు గ్రామాలతోపాటు పరిసర గ్రామాల్లో పూల సాగు తగ్గిపోవడంతో  రైతులు, కూలీలు,  ఉపాధి కోల్పోయారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16951
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author